సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి..
1 min read– సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: మలేరియా, డెంగ్యూ, డయేరియా తదితర సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్త చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ వైద్య మరియు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో సీజనల్ వ్యాధుల అప్రమత్తతపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ వర్షాకాలం ఆరంభమైన నేపథ్యంలో త్రాగునీరు కలుషితమై మలేరియా, డెంగ్యూ, డయేరియా తదితర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతిరోజు క్లోరినేట్ చేసిన తాగునీటినే సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్, పంచాయత్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గ్రామ, పట్టణ వీధుల్లోని లోతట్టు ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. నిల్వ ఉండే నీటిలో ఆయిల్ బాల్స్ వేసి కలుషిత ప్రభావాన్ని అరికట్టాలన్నారు.జిల్లాలో ఉన్న 775 ఓహెచ్ఆర్ఎస్ ట్యాంకులను ప్రతి నెల 5వ తేదీ, 20వ తేదీలలో శుభ్రపరచడంతో పాటు సంబంధిత తేదీలను బోర్డుపై ప్రదర్శించాలన్నారు.త్రాగునీటిని క్లోరినేట్ చేసి, నీటిని సరఫరా చేసిన సమయాలకు సంబంధించిన రిజిస్టర్, చేతిపంపులు, పైప్లైన్ లకు సంబంధించిన అస్సెస్స్ట్ రిజిస్టర్, ఓహెచ్ఆర్ఎస్ క్లీనింగ్ అమలు తేదీ రిజిస్టర్ తదితరాలను ఖచ్చితంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిపిఓ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని 460 వాటర్ ప్లాంట్లలో సురక్షిత మంచి నీటి టెస్టులు నిర్వహించి నిబంధనల మేరకు నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. నంద్యాల పట్టణంలో పారిశుధ్యం మెరుగుదలపై శానిటరీ ఇన్స్పెక్టర్ కు ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.జిల్లాలో ఉన్న 38 సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, 36 బీసీ వెల్ఫేర్ హాస్టళ్లు, 16 గిరిజన వసతి గృహాల్లో పనిచేయని ఆర్వో ప్లాంట్లను గుర్తించి తగు మరమ్మత్తులకు ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ సంక్షేమ అధికారులను ఆదేశించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో పనిచేయని ఆర్ఓ ప్లాంట్ల మరమ్మత్తులకు కూడా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మలేరియా, డెంగ్యూ, డయేరియా తదితర సీజనల్ వ్యాధులకు సంబంధించిన కిట్స్, వైద్య సామాగ్రి, మందులు ప్రతి మెడికల్ ఆఫీసర్ దగ్గర అందుబాటులో ఉంచి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్వో ను కలెక్టర్ ఆదేశించారు. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారులు సమయపాలన పాటించి క్రమం తప్పకుండా విధులకు హాజరై చిత్తశుద్ధితో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డిఎంహెచ్వో డా. వెంకటరమణ, డిసిహెచ్ఎస్ డా.జఫ్రూళ్ల, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ మనోహర్, జిల్లా పరిషత్ డిప్యూటీ సిఈఓ సుబ్బారెడ్డి, డిఆర్డిఎ పిడి శ్రీధర్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి మంజులవాణి, అన్ని మండలాల వైద్యాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.