PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీలో భూ భకాసురుడు..ప్రభుత్వ భూమి హాం పట్..

1 min read

– జూపాడుబంగ్లా లో ప్రభుత్వ స్థలాలు కాపాడే దిక్కులేదా..?
– అంగన్ వాడీ స్థలం వదలని వైసీపీ నాయకుడు..
– భూ కబ్జాలు చేస్తున్న నేతపై అధికారులకు ఎందుకంత ప్రేమ..
– చూసి చూడనట్లు ప్రభుత్వ అధికారులు ఎందుకు వ్యవహరిస్తున్నారు.?
– అంగన్ వాడీ స్థలం కబ్జా చేసిన పట్టించుకోరా.. ?
– జూపాడుబంగ్లా లో కబ్జా చేస్తున్న నేతకు వత్తాసు పలికితే సహించేది లేదు.
– వైకాపా నాయకులు సూదిరెడ్డి రమేష్ రెడ్డి..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు : పురాణాలలో బకాసురుడు గురించి అందరికి తెలిసిన విషయమే కానీ జూపాడుబంగ్లా మండల కేంద్రంలోని వైసీపీ పార్టీకి చెందిన భూ బకాసురుడు గురించి విని ఉండరు. ప్రభుత్వ భూమి ఎక్కడ కనిపించిన స్వాహా చేస్తూ భూ దాహం తీర్చుకోవడమే అతని ద్వేయం. అతని భూ దాహానికి ప్రజలే కాదు ప్రభుత్వ అధికారులు సైతం అడ్డు చెప్పడానికి జంకుతున్నారని సమాచారం. జూపాడుబంగ్లా మండల కేంద్రం ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో ఉన్న పేదల ఇళ్ళ స్థలాలు కబ్జా చేసి ఒక వైకాపా నాయకుడు రూ.లక్షలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నా వైసీపీ నేతకు అధికారులు ఎందుకు వత్తాసు పలుకుతున్నారో అర్ధం కావడం లేదని ప్రభుత్వ స్థలాలను కాపాడేది ఎవరని జూపాడుబంగ్లా వైకాపా నాయకులు సూదిరెడ్డి రమేష్ రెడ్డి ప్రశ్నించారు. జూపాడుబంగ్లా మండల కేంద్రంలో ఆక్రమణకు గురైన మెగా గోకులం, అంగన్ వాడీ కేంద్రాలకు చెందిన స్థలాలను గ్రామానికి చెందిన ఒక అధికార పార్టీ నేత కబ్జా చేశారని శనివారం జూపాడుబంగ్లా మండల అభివృద్ధి అధికారిణి మంజుల వాణికి , మండల తహశీల్దార్ పుల్లయ్య యాదవ్ కు గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు సూదిరెడ్డి రమేష్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నేతలు బాబు, సుధాకర్, అడ్డాకుల ప్రసాద్ , సీపీఐ నాయకులు రమేష్ బాబు, బి ఎస్ పి పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల స్వాములు లు పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ భూ కబ్జాలు చేస్తున్న నాయకునికి అధికార పార్టీ కి చెందిన నియోజకవర్గ ప్రజా ప్రతినిధి అండ గా ఉన్నారని ఇలాంటి నాయకులు పార్టీలో ఉంటూ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని వారు విమర్శించారు. గత ప్రభుత్వం రైతన్నల సంక్షేమం కోసం పాడి పశువులకు నీడనిచ్చేందుకు మెగా గోకులం షెడ్డు కొరకు 25 సెంట్ల భూమిని కేటాయించి పిల్లర్లు వేశారని. అంతే కాకుండా ఆ నిర్మాణానికి రూ.1.65 లక్ష వరకు కూడా బిల్లులు అయ్యాయన్నారు. ప్రభుత్వ ఆస్తులకు జూపాడుబంగ్లా లో రక్షణ లేదని ప్రభుత్వ భూములు కాపాడాల్సిన అధికారులు నిమ్మకునీరెక్కినట్లు వ్యవహరించడం దారుణమన్నారు. సర్వే నెంబర్ 711 – 2 లో దాదాపు 25 సెంట్లల్లో రూ.21 లక్షలతో మెగా గోకులం షెడ్డు నిర్మాణానికి కేటాయించిన స్థలం, అంతే కాకుండా అంగన్ వాడీ కేంద్రానికి సర్వే నెంబర్ 708 -A లో 2020 లో గ్రామ పంచాయతీ తీర్మానం చేసి కేటాయించిన 3 సెంట్ల స్థలం గ్రామానికి చెందిన అధికార పార్టీ నేత కబ్జా చేసి బినామీల పేర్లతో నకిలీ పట్టాలు సృష్టించారన్నారు. మండల కేంద్రంలో అంగన్ వాడీ కేంద్రం – 4 కు నాడు నేడు నిధులతో దాదాపు రూ.2.50 లక్షలు ఖర్చు చేసి నిర్మాణానికి కావాల్సిన సామగ్రి కూడా కొన్నారన్నారు. వాటన్నిటినీ తొలగించి వైకాప పార్టీ నేత కబ్జా చేసి ఈ స్థలం మాది అని అంగన్ వాడీ వారికి లేదని బెదిరిస్తున్నారని అంగన్ వాడి కార్యకర్త విలేకరుల ఎదుట పేర్కొన్నారు. ఈ నేతకు ప్రభుత్వ అధికారులు అండగా ఉండటం దుర్మార్గమైన చర్య అని అధికారులకు ఎన్నిసార్లు పిర్యాదు చేసిన ఎవరు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ భూ కబ్జాలపై జిల్లా కలెక్టర్ కు, జిల్లా ఉన్నతాధికారులకు, పార్టీ పెద్దలకు పిర్యాదు చేస్తామని వారు హెచ్చరించారు.

స్వాహా, భూ దాహం, ఆక్రమణకు, పిర్యాదు,

About Author