నేడు పత్తికొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ : ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేయాలని కోరుతూ, బుధవారం పత్తికొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామని న్యాయవాదుల సంఘం అధ్యక్షులు ఎన్.కృష్ణయ్య తెలిపారు. మంగళవారం పత్తికొండ పట్టణంలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో అధ్యక్షులు కృష్ణయ్య న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ (భూ హక్కు చట్టం) 27/2023 వల్ల కలిగే నష్టాలను రైతులకు, ప్రజలకు వివరించాలని తెలిపారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేయాలని కోరుతూ గత నెల నుండి రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో న్యాయవాదులు వివిధ రూపాలలో నిరసనలు తెలుపుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై స్పందించకపోవడంతో వివిధ రాజకీయ పార్టీ, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులతో చర్చించి ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని వివరించారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను ప్రభుత్వం రద్దు చేసేంతవరకు నిరసనలను ఇలాగే కొనసాగిస్తామని తెలిపారు. అందులో భాగంగా బుధవారం 10:30 గంటలకు పత్తికొండ న్యాయవాదుల సంఘం ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు బైక్ ర్యాలీ ఉంటుందని వివరించారు. కావున న్యాయవాదులందరూ ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షులు దామోదరచారి, సీనియర్, జూనియర్ న్యాయవాదులు కారప్ప, మల్లికార్జున, ఈరన్న, చంద్రశేఖర్ నాయుడు, పంపాపతి, రమేష్ బాబు, హుళ్తేన్న, రవి ప్రకాష్, వెంకటేశ్వర్లు, సుధా కృష్ణ, శ్రీకాంత్ రెడ్డి, భాస్కర్, రవి, కబీర్దాస్, అబ్దుల్ రాజాక్, లక్ష్మన్న, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.