PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

త్వర‌గా గుర్తించ‌గ‌లిగితే క్యాన్సర్​ ప్రాణాంత‌కం కాదు

1 min read

– ముంద‌స్తు స్వీయ గుర్తింపుతో చికిత్సలో మంచి ఫ‌లితాలు
– క‌ల్లం అంజిరెడ్డి క‌ళాశాల‌లో ఎస్ఎల్‌జీ ఆస్పత్రి ఆధ్వర్యంలో కేన్సర్ అవ‌గాహ‌న స‌ద‌స్సు
– విద్యార్థుల అనుమానాలు నివృత్తి చేసిన డాక్టర్ భార్గవ‌
పల్లెవెలుగు వెబ్ హైద‌రాబాద్: మ‌న దేశంలో వ‌స్తున్నవాటిలో చాలార‌కాల కేన్సర్లను ఎవ‌రికి వారే కొంత‌వ‌ర‌కు గుర్తించ‌వ‌చ్చని, దీనిపై స‌మాజంలో విస్తృతంగా అవ‌గాహ‌న రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని న‌గ‌రంలోని ప్రధాన ఆస్పత్రుల‌లో ఒక‌టైన ఎస్ఎల్‌జీ ఆస్పత్రికి చెందిన హెడ్ అండ్ నెక్ కేన్సర్ స‌ర్జన్ డాక్టర్ భార్గవ సూచించారు. ప్రపంచ కేన్సర్ దినం సంద‌ర్భంగా మ‌దీనాగూడ‌లోని క‌ల్లం అంజిరెడ్డి క‌ళాశాల విద్యార్థినీ విద్యార్థుల‌కు అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వహించారు. సుమారు వంద మందికి పైగా విద్యార్థినీ విద్యార్థులు ఈ స‌ద‌స్సులో పాల్గొని త‌మ అనుమానాల‌ను నివృత్తి చేసుకున్నారు. కేన్సర్‌ను ఎలా గుర్తించాలి.. దాని ల‌క్షణాలేంటి, అది ఏ ద‌శ‌లో ఉందో ఎలా గుర్తిస్తారు, దానికి చికిత్సలు ఏమున్నాయి అనే అంశాల‌పై ప్రధానంగా డాక్టర్ భార్గవ వివ‌రించారు. భార‌త‌దేశంలో రొమ్ముకేన్సర్, గ‌ర్భాశ‌య ముఖ‌ద్వార కేన్సర్లు మ‌హిళ‌ల్లో ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయ‌ని ఆయ‌న తెలిపారు. ఈ రెండింటినీ మ‌హిళ‌లు త‌మ‌కు తాముగానే గుర్తించ‌వ‌చ్చని, రొమ్ములో గ‌డ్డలు క‌నిపించ‌డం, బ్లీడింగ్ ఎక్కువ‌గా కావ‌డం లాంటివి క‌నిపిస్తే వెంట‌నే అనుమానించి వైద్యులను సంప్రదించాల‌ని చెప్పారు. నోటి కేన్సర్ అయితే నోట్లో పుండ్లు రావ‌డం, ర‌క్తం కార‌డం, వాపు లాంటి ల‌క్షణాలు వ‌స్తాయ‌న్నారు. జ‌న్యుప‌ర‌మైన కార‌ణాల‌తో పాటు.. పొగ‌తాగ‌డం, పొగాకు న‌మ‌ల‌డం, ఫాస్ట్ ఫుడ్ తిన‌డం, వాయుకాలుష్యం లాంటివాటి వ‌ల్ల సైతం కేన్సర్ వ‌చ్చే ప్ర‌మాదం ఉంటుంద‌ని ఆయ‌న వివ‌రించారు. క్లోజ్ ద కేర్ గ్యాప్ అనేది ఈ సంవ‌త్సరం ప్రపంచ కేన్స‌ర్ దినం థీమ్. అంటే ముఖ్యంగా కేన్సర్ చికిత్స అంద‌డంలో పేద‌లు, ధ‌న‌వంతులు, న‌గ‌ర‌వాసులు, గ్రామీణులు.. ఇలాంటి భేద‌భావాలు ఉండ‌కూడ‌ద‌ని, అంద‌రికీ స‌రైన స‌మ‌యానికి చికిత్స అందిస్తే అస‌లు కేన్సర్ అనేది ప్రాణాంత‌కం కూడా కాద‌ని తెలిపారు. త‌మ కుటుంబంలో ఎవ‌రికైనా ఇలాంటి ల‌క్షణాలుంటే ఎలా గుర్తించాలి, అలాగే త‌మ చుట్టుప‌క్కల ఉన్న స‌మాజంలో సైతం కేన్సర్‌ను గుర్తించే విధానాల గురించి అంద‌రికీ ఎలా అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్న విష‌యాల గురించి విద్యార్థుల‌కు డాక్టర్ భార్గవ కూలంక‌షంగా చెప్పారు. కేన్సర్‌ను నిర్ధారించేందుకు ప‌లుర‌కాల ప‌రీక్షలు ఉంటాయ‌ని ఆయ‌న తెలిపారు. సీటీ స్కాన్, ఎంఆర్ఐల‌తో పాటు.. పెట్ సీటీ స్కాన్ ద్వారా శ‌రీరంలో ఏయేభాగాల్లో కేన్సర్ ఎంత తీవ్రంగా ఉంద‌న్న విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తుంద‌న్నారు. బ‌యాప్సీ ప‌రీక్ష ద్వారా కూడా నిర్ధారించిన త‌ర్వాత‌.. శ‌స్త్రచికిత్స‌, కీమోథెర‌పీ, రేడియేష‌న్ థెర‌పీ లాంటివాటి ద్వారా దీనికి చికిత్సలు చేస్తామ‌న్నారు. ముఖ్యంగా రేడియోథెర‌పీ, కీమోథెర‌పీల వ‌ల్ల కొంత‌మేర దుష్ప్రభావాలు ఉన్నా.. వాటికి భ‌య‌ప‌డి చికిత్స తీసుకోకుండా మానేయ‌కూడ‌ద‌ని, అలా చేస్తే ప్రాణాల‌కే ముప్పు వ‌స్తుంద‌ని తెలిపారు. ఈ స‌మాచారాన్ని అంద‌రికీ తెలియ‌జేయాల‌ని, ముఖ్యంగా కేన్స‌ర్ లాంటి మ‌హ‌మ్మారిపై స‌మాజంలో అవ‌గాహ‌న అవ‌స‌ర‌మ‌ని డాక్టర్ భార్గ‌వ చెప్పారు.అనంత‌రం విద్యార్థినీ విద్యార్థులు వివిధ ర‌కాల కేన్సర్లు, అవి రావ‌డానికి ఉండే ప్రధాన కార‌ణాలు, వాటిని గుర్తించ‌డం, వాటిలో ఉన్న చికిత్స ప‌ద్ధతుల గురించి త‌మ‌కున్న అనుమానాల‌ను నివృత్తి చేసుకున్నారు.

About Author