PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జైళ్ళలో కుల వివక్షతకు అంతం పలకాలి

1 min read

ఆంధ్రప్రదేశ్ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉపాధ్యక్షులు కేసన శంకరరావు  గుడిసె శివన్న.

 పల్లెవెలుగు వెబ్ కర్నూలు:       దేశంలోని అనేక జైళ్ళలో అనేక దశాబ్దాలుగా కారాగార నిబంధనలకు కళంకం తెచ్చేలా, కుల ఆధారిత నియమ- నిబంధనలు అమలుపరుస్తూ,కుల వివక్ష కొనసాగించడం చాలా దారుణం, రాజ్యాంగ విరుద్ధమంటూ, ఇటీవల సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడాన్ని, ఆంధ్రప్రదేశ్ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉపాధ్యక్షులు కేసన శంకరరావు గుడిసె శివన్న ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఊడవడం,కడగడం వంటి శుభ్రం చేసే పనుల్లో నిమ్న కులాల ఖైదీలను, వంట,తోట పనులు చేసే వివిధ పనుల్లో అగ్రకుల ఖైదీలను కేటాయించడం, అలాగే గదులు కేటాయించడంలో ఖైదీల మధ్య కుల వివక్ష చూపడం అన్యాయమని,జైలు మాన్యువల్సును సమూలంగా మార్చాల్సి ఉందని,అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికైనా తెల్పడం సంతోషదాయకమన్నారు. దిగువ కులాల వారిపై ఒక రకమైన భాష, అంటే” అరే, ఒరేయ్”అంటూ బూతు మాటలు ఉపయోగించడం, అగ్రవర్ణ ఖైదీల విషయంలో ఎంతో మర్యాదపూర్వక సంభాషణ చేయడం వంటి వివక్షతలకు వ్యతిరేకంగా,జైలు మాన్యువల్స్ ను విలువలు-ప్రమాణాలతో రూపొందించాలన్నారు. అందుకు రాజ్యాంగపర అంశాలు,మానవ హక్కులు,కొన్ని సంస్థలు-ప్రజా సంఘాలు-కుల సంఘాలు-వివిధ కమిటీల సిఫారసులు-సలహాలు- సూచనల కనుగుణంగా జైలు మాన్యువల్స్ రూపొందించాలని కేసన కోరారు .సామాన్యంగా జైళ్ళలో బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారే 90 శాతానికి పైగా ఉంటారన్నారు. జైళ్ళలో ఖైదీలుగా- నేరస్తులుగా ఉన్న వీరిలో పరివర్తన తెచ్చేలా,సంస్కరించే విధంగా జైళ్ల మాన్యువల్స్ ఉండాలన్నారు. జైళ్లు ఖైదీలకు పునరావాస కేంద్రాలుగా ఉపయోగపడాలే తప్ప,నిర్బంధ కేంద్రాలుగా పని చేయకూడదని వారు ఉద్ఘాటించారు.సుప్రీంకోర్టు సూచించిన మేరకు 2016లో ప్రవేశపెట్టిన తాజా మోడల్ ప్రిజన్ మాన్యువల్, 2023 నుంచి అమలు చేస్తున్న మోడల్ ప్రిజన్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ యాక్ట్ లలో మార్పులు చేసేలా, కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు గైకొనాలని వారు కోరారు. పుట్టుకతోనే కొన్ని ఆదివాసి తెగలను శాశ్వత నేరస్తులుగా చిత్రీకరించడాన్ని తప్పుపడుతున్నామన్నారు. వలస పాలకుల నాటి చట్టాలే ఈనాటికీ ప్రభావితం చేయడం దురదృష్టకరమన్నారు. ఈనాటికీ ఇంత  పెద్ద ఎత్తున కుల వివక్షతను  కొనసాగించే నిబంధనలు జైళ్ళలో కొనసాగడం అన్యాయమన్నారు. అనాదిగా భారతీయ సమాజంలో పాదుకుపోయిన మనువాద ఆధిపత్యకుల పెత్తందారీ ధోరణులే ఇందుకు  కారణమని, అవన్నీ ఈనాడు మారాల్సిన అవసరం ఉందని, అందుకు ముందుగా “జైళ్ళలో కుల వివక్షతను అంతం చేయాలని” శంకరరావు గుడిసె శివన్న ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *