సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను తొలగించాలి: సీపీఐ డిమాండ్
1 min read
ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతకు చర్యలు తీసుకోవాలి
న్యూస్ నేడు, పత్తికొండ: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని, ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను కాపాడాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు.మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం పత్తికొండ పట్టణంలోని నాలుగు స్తంభాల కూడలిలో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎన్నికల కమిషన్ వ్యవహారశైలిని నిరసిస్తూ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సీపీఐ పట్టణ కార్యదర్శి ఎన్. రామాంజనేయులు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నబీ రసూల్, డి. రాజా సాహెబ్, సీపీఐ మండల కార్యదర్శి యు. కారుమంచి పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, ప్రజా పోరాటాల ఫలితంగా సాధించుకున్న భారతదేశం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలని అన్నారు. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థల స్వతంత్రతను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.2023లో తీసుకొచ్చిన ఎన్నికల కమిషనర్ల నియామక చట్టం ఎన్నికల కమిషన్ స్వతంత్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోందని వారు పేర్కొన్నారు. గతంలో ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భాగస్వామ్యంతో కూడిన నియామక ప్రక్రియను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషనర్ల నియామకంలో నిష్పాక్షికత, పారదర్శకత ఉండాలని, ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజలకు విశ్వాసం కలిగించేలా చట్టాలను రూపొందించాలని కోరారు.


