NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బొక్కిన దానిని కక్కించిన నగరపాలక సంస్థ కమిషనర్

1 min read

కాజేసిన సొమ్ము కక్కేశారు            

ఏలూరు కార్పొరేషన్‌లో రూ.1.04 కోట్ల రికవరీ,అక్రమార్కులకు ముకుతాడు    

కార్పొరేషన్ ఖజానాకు మళ్లీ కోటి రూపాయలు

కాజేసిన సొమ్ము కట్టినా శిక్ష తప్పదు                

కమిషనర్ భాను ప్రతాప్ విలేకరుల సమావేశంలో వెల్లడి

​ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఖాతాల్లో జరిగిన సుమారు రూ.1,31,60,440 నిధుల దుర్వినియోగం వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అక్రమాలకు బాధ్యులుగా గుర్తించి గతంలో సస్పెండ్ చేసిన ఐదుగురు ఉద్యోగుల్లో నలుగురు ఉద్యోగులు తమ వాటా సొమ్మును తిరిగి కార్పొరేషన్ ఖజానాకు జమ చేశారు.  మేనేజర్ మూర్తి,అకౌంటెంట్ లింగేశ్వరి, బి1 రవికుమార్, అటెండర్ మోహన్‌లు తలా రూ:26 లక్షల చొప్పున మొత్తం రూ:1.04 కోట్లు తిరిగి కార్పొరేషన్ ఖాతాలో జమ చేశారని మున్సిపల్ కమిషనర్ ఏ.భాను ప్రతాప్ మీడియా  సమావేశంలో వెల్లడించారు. 

ప్రధాన నిందితుడిపై క్రిమినల్ చర్యలు

పర్యవేక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి,పలుమార్లు హెచ్చరించినా తీరు మార్చుకోని ప్రధాన నిందితుడు, షరాఫ్ గున్నాపు శ్రీనివాసరావుపై కఠినమైన క్రిమినల్ ప్రొసీజర్‌తో పాటు శాఖాపరమైన విచారణను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. 

డబ్బు చెల్లించినంత మాత్రాన తప్పు ఒప్పు కాదు

“కాజేసిన సొమ్మును తిరిగి చెల్లించినంత మాత్రాన చేసిన తప్పు ఒప్పు అయిపోదు. విచారణ పూర్తయిన తర్వాత చట్టప్రకారం క్రమశిక్షణ చర్యలు తప్పక ఉంటాయి” అని కమిషనర్ స్పష్టం చేశారు.  బ్యాంకింగ్ వ్యవస్థతో అక్రమాలకు చెక్ భవిష్యత్తులో ప్రజల నుంచి వసూలయ్యే పన్నులు, రుసుముల సొమ్ము నేరుగా బ్యాంకు ఖాతాల్లోకే జమ అయ్యేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందుకోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్ బి ఐ బజార్ బ్రాంచ్ అధికారులతో మాట్లాడి, కార్పొరేషన్ ప్రాంగణంలోనే ప్రత్యేక బ్యాంక్ బ్రాంచ్, ఏటీఎమ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.  ఈ కేసు విచారణలో సహకరించిన జిల్లా కలెక్టర్  వి. ప్రసన్న, జేసీ అభిషేక్ గౌడ్, ఎస్పీ, డిఎస్పీ, స్థానిక ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ (బాబు)లకు కమిషనర్ భాను ప్రతాప్ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్,యం ఇ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *