మహా పాదయాత్రను జయప్రదం చేయండి … సిపిఎం
1 min readపల్లెవెలుగు వెబ్, పత్తికొండ : జిల్లాలో సాగునీటి పెండింగ్ ప్రాజెక్టుల పూర్తిచేయాలని జిల్లా సమగ్రా అభివృద్ధి కొరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన మహా పాదయాత్రను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా నాయకులు బి వీరశేఖర్ పిలుపునిచ్చారు. బుధవారం సిపిఎం ప్రజాసంఘాల మండల బాధ్యులు యూసుఫ్ అధ్యక్షతన మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు బి. వీరశేఖర్ మాట్లాడుతూ,ఈనెల 26 నుండి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలోని దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టు లు పూర్తి చేయాలని, అదేవిధంగా జిల్లా సమగ్ర అభివృద్ధి కొరకు సిపిఎం ఆధ్వర్యంలో ఆదోని నుండి కర్నూలు వరకు చేపడుతున్నటువంటి మహా పాదయాత్రను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఏళ్ల తరబడి జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని, కేవలం ఎన్నికల హామీలుగానే వేదవతి ,హంద్రీనీవా ,గురు రాఘవేంద్ర, ఆర్డీఎస్ కుడికాలువ ,గుండ్రేవుల ,తదితర సాగునీటి ప్రాజెక్టులు మిగిలిపోతున్నాయన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడంలో గత 20 సంవత్సరాలుగా పాలకులకు చిత్తశుద్ధి లేదని అన్నారు. ఇప్పటికైనా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సిపిఎం చేపట్టిన మహా పాదయాత్ర జయప్రదం కోసం అందరూ కలిసి రావాలని కోరారు. జిల్లా సమగ్ర అభివృద్ధి కావాలంటే పరిశ్రమలు,విద్యా, వైద్య రంగాలలో ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాలని సూచించారు. ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్, రైల్వే వ్యగన్ వర్క్ షాప్ నిర్మాణాలు వెంటనే చేపట్టి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. రాయలసీమ జిల్లాల లోని తలమానికంగా ఉన్న ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ను ఏయిమ్స్ స్థాయిలో అభివృద్ధి చేయాలని ఆ విధమైన పద్ధతిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. విద్య పరంగా రాయలసీమ విశ్వవిద్యాలయం ఉన్న విశ్వవిద్యాలయంలో నిధులు లేక కూనారిల్లుతుందని, సరైన ఫ్యాకల్టీలు, ,మౌలిక సదుపాయాలు లేవని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని విద్యాలయాలు జిల్లాలో ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో జూనియర్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వ ప్రయత్నం చేయాలని వారు కోరారు.సాగునీటి ప్రాజెక్టుల సాధన ,విద్య ,వైద్యం మౌలిక సదుపాయాల కోసం సిపిఎం పార్టీ చేసే మహా పాదయాత్రను జయప్రదం కై ప్రజలంతా సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు అశోక్, మహబూబ్బాషా నాయకులు ఓంకార్ ,శ్రీనివాసులు, వీరన్న, పాండు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.