పోలకల్లు గ్రామంలో కుల వివక్షపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు
1 min read
సివిల్ రైట్స్ డేలో వెలుగులోకి వచ్చిన పలు సమస్యలను వివరించిన డివిఎంసి సభ్యురాలు గొందిపల్లె మాలతి
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం పోలకల్లు గ్రామంలో నిర్వహించిన సివిల్ రైట్స్ డే కార్యక్రమంలో కుల వివక్షకు సంబంధించిన పలు సమస్యలు వెలుగులోకి వచ్చాయని డీవీఎంసీ సభ్యురాలు గొందిపల్లె మాలతి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరిని కలిసి ఫిర్యాదు చేశారు సివిల్ రైట్స్ డే కార్యక్రమానికి తాను ఎమ్మార్వో వెంకటలక్ష్మి హాజరైన సందర్భంగా స్థానిక ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు.గ్రామంలోని కొందరు ప్రజలను ఆలయంలోకి అనుమతించడం లేదని, శుభకార్యాలు నిర్వహించే సమయంలో బ్యాండ్ మేళం, సన్నాయి మేళం వంటి సేవలను అందించేందుకు గ్రామంలోని వారు ముందుకు రావడం లేదని స్థానికులు చెప్పినట్లు ఆమె తెలిపారు. దీంతో పక్క గ్రామాలకు వెళ్లి ఆయా సేవలను తీసుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. అదేవిధంగా గ్రామంలో క్షవరం, హెయిర్ కటింగ్, గడ్డం చేయించుకునే సౌకర్యం కూడా తమకు అందుబాటులో లేదని, ఇందుకోసం పక్క గ్రామాలకు వెళ్లాల్సి వస్తోందని బాధితులు తెలిపినట్లు మాలతి వెల్లడించారు. టీ హోటళ్ల విషయంలోనూ వివక్ష ఎదురవుతోందని స్థానికులు ఆరోపించినట్లు ఆమె తెలిపారు. తాము హోటల్లో తినడానికి వెళ్లినప్పుడు వివక్ష చూపడంతో పాటు, హోటల్ యజమానులను బెదిరించి హోటల్ మూసివేయించే పరిస్థితులు ఉన్నాయని వారు చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే ఇతర కులాలకు చెందిన వారు అదే హోటళ్లలో కూర్చొని తిని వెళ్లినా ఎలాంటి అభ్యంతరాలు ఉండటం లేదని స్థానికులు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఒక వర్గానికి ఒక న్యాయం, మరో వర్గానికి మరో న్యాయం ఎందుకు? అని ప్రశ్నిస్తూ ఈ విషయాలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు డీవీఎంసీ సభ్యురాలు గొందిపల్లె మాలతి తెలిపారు. ఈ అంశాలపై తగిన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ఆమె కోరారు. ప్రతి గ్రామంలో సివిల్ రైట్స్ డేను క్రమం తప్పకుండా నిర్వహించాలని, ఇటువంటి కార్యక్రమాల్లో డీవీఎంసీ సభ్యులను కూడా భాగస్వాములను చేయాలని తాము కోరుతున్నట్లు మాలతి తెలిపారు. సివిల్ రైట్స్ డేను పోలకల్లు గ్రామంలో నిర్వహించడం సంతోషకరమని, అయితే కార్యక్రమాల ద్వారా వెలుగులోకి వచ్చే ప్రజా సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె కోరారు.


