పోలవరం ప్రాజెక్టు నిధులకై సిపిఐ పాదయాత్ర…
1 min read– సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు: పోలవరం ప్రాజెక్టు నిధుల కోసం, నిర్వాసితుల పునరవాసం, ప్యాకేజీ తదితర సమస్యలకు పరిష్కారం నిమిత్తం త్వరలో పోలవరం నుండి అమరావతి వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, పార్టీ ఏలూరు జిల్లా ఇన్చార్జ్ అక్కినేని వనజ తెలిపారు. బుధవారం స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనం నందు జరిగిన విలేకరుల సమావేశంలో అక్కినేని వనజ మాట్లాడుతూ ఈనెల 23న విజయవాడలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగిందని, ఈ సమావేశంలో రాబోయే కాలంలో ప్రజాక్షేత్రంలో సమస్యలపై సిపిఐ చేసే పోరాటాలు చర్చించామన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారని విమర్శించారు. సిపిఐ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం ఇరిగేషన్ ప్రాజెక్టులను పరిశీలించి, పోలవరం ప్రాజెక్టు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఆందోళనకు సిద్ధం అవుతుందని తెలిపారు. తెలుగు ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టును కేంద్రమే నిర్మించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు కేంద్రమే నిర్మించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. సిపిఐ ఆధ్వర్యంలో పోలవరం నుండి అమరావతి పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. ఈ నెల 28న విజయవాడలో సమావేశమై పాదయాత్ర పై కార్యాచరణ రూపొందిస్తామన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల సందర్భంగా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రతి ఎకరాకు రూ.5 లక్షలు, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ లో భాగంగా రూ.10 లక్షలు ఇస్తామని వాగ్దానం చేసి నిర్వాసితులను మోసం చేశారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే 7.20 లక్షల ఎకరాలకు సాగునీరు, 20 లక్షల ఎకరాలకు సరిపడా సాగునీరు స్థిరీకరణ,960 మెగావాట్లు విద్యుత్తు లభ్యమవుతుందన్నారు.26 జిల్లాలు అభివృద్ధి చెందే విధంగా పోలవరం ప్రాజెక్టు ఉపయోగపడుతుందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.