అందరి సహకారంతోనే అభివృద్ధి,ఎంపీ కార్యాలయంలో ప్రజా దర్బార్
1 min read
వినతిపత్రాలతో బారులు తీరిన ప్రజలు,ఎంపీను కలిసిన అమరావతి -ఖరగపూర్ ఎక్స్ ప్రెస్ హైవే గ్రామాల ప్రజలు
నేవీ డిపో భూములపై బోడిగూడెం గ్రామస్థుల భిన్న స్వరం,సీఎంతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన ఎంపీ పుట్టా మహేష్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: వివిధ అభివృద్ధి పనులకు భూసేకరణ చేసే సమయంలో స్థానిక ప్రజల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తూ ముందుకు వెళతామని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం ఏలూరు క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎంపీ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను కలిశారు. కొత్తగా నిర్మిస్తున్న అమరావతి -ఖరగపూర్ ఎక్స్ ప్రెస్ హైవే భూ సేకరణలో తమ భూములు, ఇళ్ళు నష్టపోకుండా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు. నేషనల్ హైవే అధికారులతో, కేంద్ర మంత్రితో మాట్లాడి న్యాయం చేస్తానని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వారికి హామీ ఇచ్చారు. ఎంపీ ను కలిసిన వారిలో ప్రధానంగా బయ్యనగూడెం, సీతంపేట, వీరన్నగూడెం, సరిపల్లి గ్రామాలకు చెందిన పలువురు రైతులు, ప్రజలు ఉన్నారు. నేవీ డిపోపై సీఎంతో చర్చించి నిర్ణయం..- నేవీ ఆయుధ డిపో ఏర్పాటుతో భూములు కోల్పోతున్న కొయ్యలగూడెం మండలం బోడిగూడెం గ్రామస్థులు బుధవారం ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను ఆయన కార్యాలయంలో కలిశారు. భూములు కోల్పోతే తమ జీవనోపాధి దెబ్బతింటుందని వారు ఎంపీ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యపై త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతానని ఎంపీ హమీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ, భూములు కోల్పోయే రైతులకు, గ్రామస్థులకు న్యాయమైన పరిహారం, హామీల అమలు తర్వాతే, సంబంధిత గ్రామాల ప్రజలందరి అంగీకారంతోనే నేవీ ఆయుధ డిపో ప్రాజెక్టు పై ముందుకు వెళతామని స్పష్టం చేశారు. దీనిపై తాను త్వరలోనే సీఎంతో సమావేశమై చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.
జిల్లా టీడీపీ పార్టీ కార్యవర్గ సమావేశంలో ఎంపీ పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా టీడీపీ పార్టీ కార్యవర్గ సమావేశం బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఉపాధ్యక్షుడు జగ్గవరపు ముత్తారెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు. పొత్తులో భాగంగా ఎవరికి అవకాశం ఇచ్చినా కూటమి పార్టీలన్నీ కలిసికట్టుగా ఉండి స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాలని తీర్మానం చేస్తూ సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించారు.


