దిగువపాడు చర్చి స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ..సీఐ
1 min read
తెగిన దిగువపాడు చర్చి రస్తా పంచాయితీ..
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : గత రెండు వారాలుగా చర్చి దగ్గర జరుగుతున్న పనులను అగ్రవర్ణాలకు చెందిన వారు అడ్డుకోవడంతో సమస్య తీవ్ర పరిణామాలకు దారి తీస్తున్న సంగతి తెలిసిందే.కానీ ఈ స్థలానికి ఆత్మకూరు డీఎస్పీ ఆర్ రామాంజి నాయక్ మరియు నందికొట్కూరు రూరల్ సీఐ టి సుబ్రహ్మణ్యం,మిడుతూరు ఎస్ఐ హెచ్ ఓబులేష్ ఫుల్ స్టాప్ పెట్టారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని మాసాపేట గ్రామ పొలిమేర అయిన దిగువపాడు గట్టు పైన ఉన్న ఆర్.సీ.యం చర్చి(కల్వరి కొండ) స్థలాన్ని పరిశీలించారు.సోమవారం 7 గంటలకు ఎస్సై మరియు సిబ్బంది వెళ్లారు.తర్వాత రూరల్ సీఐ రాత్రి 11 గంటల వరకు కల్వరి కొండ స్థలం దగ్గరే ఉన్నారు.మంగళవారం ఆత్మకూరు డీఎస్పీ,సీఐ, తహసిల్దార్ టి శ్రీనివాసులు,ఎస్ఐ స్థలాన్ని పరిశీలించి ఇరు వర్గాలతో మాట్లాడి రస్తా పంచాయతీకి మార్గం సుగమం చేశారు. పక్కన ఉన్న రస్తాలో ట్రాక్టర్లు ఫోక్లైన్ లతో మొర్సు వేయిస్తూ చదును చేయించారు.ఈ పనులు పూర్తయ్య వరకు అధికారులు దగ్గర ఉంటూ పనులు చేయించారు.గొడవలు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ప్రశాంతంగా ఉండాలని డీఎస్పీ,సీఐ హెచ్చరించారు.స్థలం దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా డీఎస్పీ,సీఐ ఆదేశాల మేరకు సర్కిల్ లోని పోలీసులు బందోబస్తు నిమిత్తం విధులు నిర్వహిస్తున్నారు.స్థలం దగ్గర ఎప్పటికప్పుడు ఎస్సై పర్యవేక్షిస్తున్నారు.