శ్రావణమాస ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
1 min read
ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయ పాలకమండలి సభ్యులు
హోళగుంద న్యూస్ నేడు: ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయంలో శ్రావణమాస ఉత్సవాలను పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ పాలకమండలి సభ్యులు తెలిపారు. శ్రావణమాసం రెండో సోమవారం సందర్భంగా ఆలయానికి లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పాలకమండలి సభ్యులు పరిశీలించారు.భక్తులు స్నానాలు చేసేందుకు ఎల్ఎల్సీ నీటిని అందుబాటులోకి తీసుకురావడానికి సహకరించిన మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి రాఘవేంద్రరెడ్డి, ఎల్ఎల్సీ చైర్మన్, ఆలయ ట్రస్టు బోర్డు సభ్యుడు అయ్యప్పకు పాలకమండలి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.భక్తుల సౌకర్యార్థం ఆలయం చుట్టూ వర్షం వచ్చినా ఇబ్బందులు లేకుండా ఇనుప షెడ్లు, ఇతర రక్షణ ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. భక్తులకు అవసరమైన ప్రాంతాల్లో మరుగుదొడ్లను నిర్మించామని, ఆలయ పరిసరాల్లో వర్షం కారణంగా బురద ఏర్పడకుండా భక్తులు కూర్చోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి అనువుగా ఫ్లోరింగ్ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు.
పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యం
ఆలయ పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని పాలకమండలి సభ్యులు తెలిపారు. ఆలయం చుట్టుపక్కల, భక్తులు సంచరించే అన్ని ప్రాంతాల్లో నిరంతరం పరిశుభ్రత ఉండేలా ప్రతిరోజూ సుమారు 80 మంది పారిశుద్ధ్య కార్మికులతో ప్రత్యేకంగా శుభ్రత పనులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఆలయానికి వచ్చే భక్తులు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని కోరారు. ఆలయ పరిసరాల్లో ఎక్కడపడితే అక్కడ మలమూత్ర విసర్జన చేయకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మరుగుదొడ్లను మాత్రమే వినియోగించాలని సూచించారు.
మూడు పూటలా అన్నదానం
గతంలో భక్తులకు మధ్యాహ్న సమయంలో మాత్రమే అన్నదానం అందుబాటులో ఉండేదని, ప్రస్తుతం భక్తుల సౌకర్యార్థం మూడు పూటలా అన్నదానం ఏర్పాటు చేసినట్లు పాలకమండలి సభ్యులు తెలిపారు. భక్తులందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.శ్రావణమాస ఉత్సవాలకు వచ్చే భక్తులకు తాగునీరు, స్నానాలు, మరుగుదొడ్లు, విశ్రాంతి, అన్నదానం, పారిశుద్ధ్యం వంటి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ పాలకమండలి సభ్యులు అయ్యప్ప, సుధాకర్, రంగస్వామి, పూజ, వినోద్, చిదానంద, గణేష్ తదితరులు పాల్గొని మీడియా ద్వారా భక్తులకు పలు సూచనలు చేశారు.


