సామాన్యుడికి.. నెలనెలా విద్యుత్ షాక్ !
1 min readపల్లెవెలుగువెబ్ : ఇకపై ప్రతి నెలా విద్యుత్ చార్జీల మోత మోగనుంది. ముందు ముందు కరెంటు చార్జీలు కూడా పెరిగిపోనున్నాయి. విద్యుత్ కొనుగోలు ధరలు, బొగ్గు, ఇంధన ధరల్లో హెచ్చుతగ్గుల ప్రభావాన్ని ఎప్పటికప్పుడు ఆటోమేటిగ్గా విద్యుత్ టారిఫ్‌లో సర్దుబాటు చేసేలా కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకువస్తోంది. ఏ నెలకు ఆ నెల భారాన్ని వినియోగదారులపై మోపేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ మేరకు ప్రస్తుతం అమల్లో ఉన్న ‘విద్యుత్ నిబంధనలు–2005’కు సవరణలు చేస్తూ.. శుక్రవారం ‘విద్యుత్ నిబంధనలు (సవరణ)–2022’ముసాయిదాను కేంద్ర విద్యుత్ శాఖ ప్రకటించింది. విద్యుదుత్పత్తికి ఇంధనంగా వినియోగించే బొగ్గు, గ్యాస్ వంటి వాటి ధరలు పెరిగితే.. అందుకు అనుగుణంగా విద్యుత్ చార్జీలూ పెరుగుతాయి. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో (పీపీఏ) మార్పులు, డిమాండ్‌కు అనుగుణంగా గ్రిడ్ నుంచి అధిక ధరలకు కొనుగోళ్లు వంటి వాటితో పెరిగే భారాన్నీ.. ఏ నెలకు ఆ నెల వినియోగదారుల నుంచి వసూలు చేయాలని కేంద్ర ప్రతిపాదనలు స్పష్టం చేస్తున్నాయి.