ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్ ద్వారానే ఎరువుల విక్రయాలు
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండలంలో ఎరువుల విక్రయాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఫ్రేమ్‌వర్క్ ఫర్ డిజిటల్ సేల్ (FFS) విధానం ద్వారా మాత్రమే నిర్వహించాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు.ఈ మేరకు మంగళవారం ప్యాపిలి ఎంపీడీఓ కార్యాలయంలో పి. సురేష్ రెడ్డి, ఏడీఏ (సాయిల్ కన్జర్వేషన్) ఆధ్వర్యంలో రైతు సేవా కేంద్రాల సిబ్బంది, ఎరువుల దుకాణాల డీలర్లకు ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కొత్త యాప్‌లో రైతులు లాగిన్ అయి ఎరువులను బుకింగ్ చేసుకునే విధానాన్ని వివరించారు. డిజిటల్ విధానం ద్వారా ఎరువుల పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని, అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. రైతులకు ఎరువులు సులభంగా అందుబాటులోకి తీసుకురావడంతో పాటు విక్రయాలపై పర్యవేక్షణ మెరుగుపడుతుందని వివరించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎ. రాజేష్, వ్యవసాయ శాఖ సిబ్బంది, ప్యాపిలి మండల ఎరువుల దుకాణాల డీలర్లు పాల్గొన్నారు.


