సామాన్య భక్తులే కేంద్రంగా ఉత్సవాల ఏర్పాట్లు
1 min read
వినూత్న కార్యాచరణతో సమగ్ర సౌకర్యాలు
ఏఐ డిస్ప్లే బోర్డులు, చైల్డ్ ట్యాగ్స్, బూమ్ బ్యారియర్స్
24 గంటలూ సేవలందించే కమాండ్ కంట్రోల్ కేంద్రం
మొత్తం 3,500 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు
మూడు హోల్డింగ్ ఏరియాల్లోనూ భక్తులకు సౌకర్యాలు
క్రౌడ్ అనలిటిక్స్ ద్వారా నిరంతర చర్యలు
ఉత్సవాల విజయవంతానికి సమష్టిగా కృషిచేద్దాం
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, సీపీ ఎస్వీ రాజశేఖరబాబు, వీఎంసీ ధ్యానచంద్ర హెచ్ఎం, ఈవో వీకే శీనా నాయక్
విజయవాడ, న్యూస్ నేడు: ఈ నెల 11వ తేదీ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి 20వ తేదీ ఆశ్వయుజ శుద్ధ దశమి వరకు జరిగే దసరా మహోత్సవాలకు వచ్చే సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, వారి భద్రత, సౌకర్యాలు, సులభ దర్శనానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, దేవస్థానం ఈవో వీకే శీనా నాయక్ తెలిపారు.శనివారం కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, దేవస్థానం ఈవో శీనా నాయక్.. రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, దేవాదాయ, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ తదితర సమన్వయ శాఖల అధికారులతో కలిసి దసరా ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించి సంయుక్త తనిఖీలు నిర్వహించారు. సీతమ్మవారి పాదాలు, కేశఖండన శాల, హోల్డింగ్ ఏరియాలు, వినాయక టెంపుల్, రథం సెంటర్, టోల్గేట్, ఘాట్‌రోడ్డు మీదుగా నడుచుకుంటూ వెళ్లి ఏర్పాట్లను విస్తృతంగా పరిశీలించారు. భక్తులకు భద్రత, సౌకర్యాల కల్పనలో ఎక్కడా రాజీపడకుండా ఏర్పాట్లు ఉండాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. అనంతరం కొండపై నలుగురూ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ దసరా ఉత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వినూత్న కార్యాచరణ రూపొందించామని, భక్తుల రాకపోకలు, దర్శనం, క్యూలైన్లు, పార్కింగ్, తాగునీరు, వైద్య సేవలు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై సమగ్ర ప్రణాళికతో ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. భక్తులకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేందుకు ఏఐ ఆధారిత డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. 24 గంటలూ సేవలందించే కమాండ్ కంట్రోల్ కేంద్రాన్నిఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఘాట్ల వద్ద జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈసారి పున్నమి ఘాట్‌లో జాతీయ సరస్ మేళా జరగనుందని.. ఈ మేళాకు గౌరవ రాష్ట్రపతి కూడా రానున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.సీపీ ఎస్వీ రాజశేఖరబాబు మాట్లాడుతూ 2024 నుంచి టెక్నాలజీకి అత్యంత ప్రాధాన్యమిస్తూ వినూత్న ప్రణాళికలతో ఏర్పాట్లు చేస్తున్నామని… ఈసారి కూడా మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బూమ్ బ్యారియర్లు, యాక్సెస్ కంట్రోలర్స్ వంటి వాటిని కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. గౌరవ సీఎం వారి మార్గనిర్దేశం మేరకు సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూస్తామన్నారు. మొత్తం 22 పార్కింగ్ పాయింట్లను ఏర్పాట్లు చేశామని.. 3,500 మంది సిబ్బందితో బందోబస్తు ఉంటుందని.. యంగ్ అండ్ డైనమిక్ పోలీసులు విధుల్లో నిమగ్నమవుతారన్నారు. ఈసారి క్రౌడ్ అనలిటిక్స్‌కు ప్రాధాన్యమిస్తూ నిరంతర సమగ్ర ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.వీఎంసీ ధ్యానచంద్ర.. దసరా ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, మరుగుదొడ్ల ఏర్పాటు తదితర మౌలిక సదుపాయాలను సమగ్రంగా కల్పిస్తున్నామని తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా పారిశుద్ధ్య సిబ్బందిని అందుబాటులో ఉంచి పరిసరాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. స్వచ్ఛ దసరా స్ఫూర్తితో ముందడుగు వేస్తున్నామన్నారు.ఈవో వీకే శీనా నాయక్.. దసరా ఉత్సవాల సందర్భంగా నిర్వహించనున్న ప్రత్యేక పూజలు, ప్రత్యేక దర్శనాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక శోభను ప్రతిబింబించేలా ప్రత్యేక అలంకరణలు, పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.



