PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నెట్ సెంటర్ లో ఘరానా మోసం..

1 min read

– పోలీస్ కానిస్టేబుల్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు..
–నకిలీ రశీదులతో మోసం చేసిన నెట్ సెంటర్ నిర్వాహకుడు
– ఆన్ లైన్ లో దరఖాస్తు చేసినట్లు ఫేక్ రశీదు లు సృష్టించిన నిర్వాహకుడు
– హల్ టికెట్ డౌన్లోడ్ లో బయటపడ్డ మోసం..
– దాదాపు 50 మంది నిరుద్యోగులు మోసం పోయినట్లు సమాచారం..
– ఇందులో కొంత మంది అభ్యర్థుల వయోపరిమితి రీత్యా చివరి అవకాశం కావడంతో తీవ్ర ఆందోళన చెందుతున్న అభ్యర్థులు…
– మాకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించిన బాధితులు..
విచారణ చేపట్టిన నందికొట్కూరు పోలీసులు
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణంలో నకిలీ రశీదులు సృష్టించి పోలీసు కొలువులకు దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులను మోసం చేసిన ఘరాన నెట్ సెంటర్ నిర్వాహకుడి ఉదాంతం నంద్యాల కర్నూలు జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది.కంప్యూటర్ సెంటర్ నిర్వాహకుని పై చట్టపరమైన చర్యలు తీసుకొని నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుతూ బాధిత నిరుద్యోగ యువత ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సెంటర్ లో కంప్యూటర్ సెంటర్ నిర్వహిస్తున్న నిర్వాహకుడు సయ్యద్ అమీర్ భాష పోలీసు కొలువు కోసం దరఖాస్తు చేసుకున్న దాదాపు 50 మంది నిరుద్యోగులను మోసం చేశాడు.పోలీసు కొలువు కోసం ఆన్ లైన్ లో పేరు నమోదు చేసినట్లు నకిలీ రశీదులు సృష్టించి నిరుద్యోగులకు శఠగోపం పెట్టాడు.దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 22 నుంచి ప్రభుత్వం ఆన్ లైన్ పరీక్షలు నిర్వహిస్తుంది. ఇందుకు సంబంధించి అభ్యర్థులు హల్ టికెట్లను ఆన్ లైన్ లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. దీనితో అభ్యర్థులు నెట్ సెంటర్ కు వెళితే హల్ టికెట్లు డౌన్లోడ్ కావడం లేదు.ఆన్ లైన్ లో ఎలాంటి సమాచారం లేకపోవడంతో మోస పోయామని గ్రహించిన నిరుద్యోగులు కంప్యూటర్ సెంటర్ నిర్వాహకుని నిలదీశారు.సర్వర్ సమస్య ఉందని దాటవేశాడు. అభ్యర్థులు మరో నెట్ సెంటర్లలో విచారించగా తమ దరఖాస్తులు ఆన్ లైన్ లో నమోదు కాలేదని తెలుసుకున్నారు. తమ కు న్యాయం చేయాలని కోరుతూ స్థానిక పోలీస్ స్టేషన్ సీఐ విజయ భాస్కర్ కు కంప్యూటర్ నిర్వాహకుడు అమీర్ బాష పై షేక్ అబ్దుల్లా మరో 17 మంది బాధితులు ఫిర్యాదు చేశారు. వయోపరిమితి దాటిపోతుందని ఇప్పటికైనా ప్రభుత్వ కొలువు సాధిస్తామని ఎన్నో ఆశలు పెట్టుకున్నామని ఇలా మోసపోతామని అనుకోలేదని ఆవేదన చెందుతున్నారు. నిర్వాహకుని అదుపులోకి తీసుకొని పోలీసు విచారణ చేపట్టారు. ఈ నెట్ సెంటర్ నిర్వాహకుడు గతంలో కూడా ఇదేవిధంగా నిరుద్యోగులను మోసం చేసినట్లు సమాచారం. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుచున్నారు. సీఐ విజయ భాస్కర్ మీడియా తో మాట్లాడుతూ నిరుద్యోగులను కంప్యూటర్ సెంటర్ నిర్వాహకుడు అమీర్ భాష నకిలీ రశీదులు సృష్టించి మోసం చేసిన విషయం వాస్తవమేనని అతని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు.బాధితులు ఇప్పటి వరకు 34 మంది మోసపోయినట్లు గుర్తించామని పూర్తి స్థాయిలో విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధితుడు షేక్ అబ్దుల్లా ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమీర్ బాష పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

About Author