మేకల కాపరి ఇంట.. చదువుల పంట..!
1 min readమెడికల్ పీజీ *నీట్ * ఎంట్రెన్స్ లో జాతీయ స్థాయిలో మెరిసిన పల్లెటూరి విద్యార్థిని ముద్దలూరు జ్ఞానప్రసన్న
పల్లెవెలుగు వెబ్, రాయచోటి/వీరబల్లి: రాజంపేట నియోజకవర్గం వీరబల్లి మండల పరిధిలోని గడికోట గ్రామపంచాయతీ లో పోట్రాజు గారి పల్లెకు చెందిన ముద్దలూరు లక్ష్మీ కాంతమ్మ వెంకట్రామరాజులు మేకల మేపుకొని జీవనం సాగిస్తున్నారు. వెంకట్రామరాజు కష్టానికి దేవుడు దయతలచి పిల్లలకు చదువుల పంట పండించాడు. దంపతుల కుమార్తె ఎం. జ్ఞానప్రసన్న బుధవారం వెలుబడిన మెడికల్ పీజీ నీట్ ఎంట్రెన్స్ ఫలితాలలో జాతీయ స్థాయిలో 926 వ ర్యాంకు సాధించి పట్టుదల ఉంటే ఏ స్థాయికైనా చేరుకోవచ్చని నిరూపించింది.
ఎం బి బి ఎస్ కు ఖర్చు పెట్టి చదివించిన అవ్వ తాతలతో డాక్టర్ జ్ఞాన ప్రసన్న
లక్ష్యం.. పేదలకు మెరుగైన వైద్యం అందించడం : జ్ఞానప్రసన్న
ఈ సందర్భంగా డాక్టర్ జ్ఞానప్రసన్న మాట్లాడుతూ తన వైద్యవిద్యకు సహాయ సహకారం అందించిన ప్రతిఒక్కరికీ రుణపడి ఉంటా. వైద్య విద్య పూర్తి చేసి పేదప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నదే నా లక్ష్యం. చిన్నప్పటి నుంచి మట్లి పుల్లంరాజుగారి పల్లెలో మేనమామ వెంకట్రామరాజు వద్ద ఉండి ప్రాథమిక విద్య, మట్లి పెద్దూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వరకు చదివాను. విజయవాడలో వైదేహి భవన్ లో నేను, మా అన్న ఎం. శశి కుమార్ రాజు, రామకృష్ణ భవన్ లో ఇంటర్ పూర్తి చేశాం. ఎంసెట్ లో ర్యాంకు సాధించి తిరుపతిలో ఎస్ వి మెడికల్ కళాశాలలో మా అన్న శశి కుమార్ రాజు, కర్నూలు మెడికల్ కళాశాలలో నేను ఎం బి బి ఎస్ చదివాము. నా చదువుకు ఆర్థికంగా సహాయం చేసిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు. ముఖ్యంగా ఎం బి బి ఎస్ చదువుకు పూర్తిగా ఖర్చు పెట్టి చదివించిన హైదరాబాద్ కు చెందిన ముసునూరు ధనకోటేశ్వర ప్రసాద్ తాతగారికి, అవ్వగారికి పాదాభివందనాలు. మా తాతగారికి జీవితమంతా ఋణపడి ఉంటా.
మేనమామ వెంకట్రామరాజుతో డాక్టర్లు జ్ఞాన ప్రసన్న,శశికుమార్ రాజు
యువతకు స్ఫూర్తి :
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివినా పట్టుదలతో చదివితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని నిరూపించిన డాక్టర్ జ్ఞానప్రసన్న.. నేటి యువతకు ఆదర్శం. ప్రస్తుత కంప్యూటర్యుగంలో టెక్నాలజీని ఉపయోగించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆమె యువతకు పిలుపునిచ్చారు. ఎంచుకున్న లక్ష్యం నెరవేరేంత వరకు పట్టుదల, శ్రద్ధ, క్రమశిక్షణ, ఏకాగ్రతతో చదివాలన్నారు.