డిఐజీ దృష్టికి “గుడికట్టు’…
1 min read– రూపు మాపేందుకు చర్యలు : డిఐజీ అమ్మిరెడ్డి హామీ
పల్లెవెలుగు వెబ్ అనంతపురం : సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామంలో జరుగుతున్న గుడికట్టు నామాలు సాంఘిక దురాచారం సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అనంతపురం రేంజ్ డి ఐ జి అమ్మిరెడ్డి హామీ ఇచ్చినట్లు బహుజన సమాజ్ పార్టీ నాయకులు తెలిపారు. బహుజన సమాజ్ పార్టీ నాయకులు డి.ఐ.జిని కలిసి శ్రీ సత్య సాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామంలో జరుగుతున్న గుడికట్టు నామాలు అనే సాంఘిక దురాచారాలను అరికట్టాలని, గ్రామం లో ఎటువంటి అశాంతి ఏర్పడకుండా, శాంతి భద్రతలు కాపాడాలని కోరుతూ డి.ఐ.జికి వినతి పత్రం సమర్పించడం జరిగినది. ఈ సందర్భంగా డి.ఐ.జి బిఎస్పీ పార్టీ నాయకుల ద్వారా అక్కడ జరుగుతున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బిఎస్పీ పార్టీ నాయకులు మేడాపురం గ్రామంలో మాదిగ కులంలోనే పెద్ద కులం చిన్న కులాలు గా ప్రజలు విభజించబడినారని, ఒకసారి ప్రభుత్వ అధికారులు అవగాహన సదస్సు నిర్వహించినా పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న వారిలో ఎలాంటి మార్పు లేదని, ఈ ఏడాది ఉగాది పండుగ రోజున తిరిగి అదే గుడికట్టు నామాలు సాంఘిక దురాచారాలను ఆచారాలను పాటించారని తెలిపారు. మరీ ముఖ్యంగా పక్కనే ఉన్న తుంపర్తి అనే గ్రామంలో ఇలాంటి దురాచారాలను స్థానిక ధర్మవరం రూరల్ ఎస్.ఐ చర్యలు తీసుకొని మార్పు తీసుకురావడం జరిగిందని, కానీ చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామ పరిధి సంబంధించిన ఎస్.ఐ ఎందుకు ఈ యొక్క సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయడం లేదో తమకు అర్థం కావడం లేదని కావున డి.ఐ.జి గారు విచారణ జరిపి మేడాపురం గ్రామంలో కూడా సాంఘిక దురాచారాలను రూపుమాపాలని కోరడమైనది. సమస్యపై సానుకూలంగా స్పందించిన డి.ఐ.జి గారు తప్పకుండా, కచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్వయంగా డి.ఐ.జి గారే మేడాపురం గ్రామం ను సందర్శించి అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేసి, శాస్వతంగా ఈ యొక్క సాంఘిక దురాచారాలను లేకుండా చేస్తామని, ఈ సారి ఉగాది పండుగ రోజున ఎలాంటి సమస్యలు లేకుండా ప్రజలంతా సమానంగా కలిసి మెలిసి పండుగ జరుపుకొనే విధంగా చర్యలు తీసుకుంటామని, అంతేకాకుండా ఉమ్మడి అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లా లలో ఇంకా ఎక్కడైనా ఇలాంటి దురాచారాలు ఉంటే లేకుండా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని బిఎస్పీ పార్టీ నాయకులకు హామీ ఇవ్వడం జరిగినది. సానుకూలంగా స్పందించి ప్రత్యేకమైన చర్యలు తీసుకొని ప్రజల్లో మార్పు తీసుకురావడానికి డి.ఐ.జి గారు చేస్తామన్న కృషి కి బిఎస్పీ పార్టీ నాయకులు డి.ఐ.జిగారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిఎస్పీ పార్టీ నాయకులు లక్ష్మి నారాయణ జిల్లా ఇంఛార్జి, అంకె కుళ్లాయప్ప జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ, ఇందీవర్ సత్యసాయి జిల్లా ఇంఛార్జి, హరిప్రసాద్ అనంతపురం నియోజకవర్గం అధ్యక్షులు, నాగరత్నమ్మ కోశాధికారి, తూర్పింటి ఓబులేసు రాప్తాడు నియోజకవర్గం ఇంచార్జి, ఆంజనేయులు రాప్తాడు నియోజకవర్గం అధ్యక్షులు, గవ్వల ఓబులేసు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.