వేధింపులు.. ఎస్ఐ ఆత్మహత్య
1 min readపల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ రూరల్ మండలం సర్పవరం పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ముత్తవరపు గోపాలకృష్ణ(32) సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సీఎం బందోబస్తు కోసం ఇచ్చిన గన్‌ను పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో పెట్టుకుని తన నివాసంలో కాల్చేసుకున్నారు. ఆ సమయంలో ఆయన భార్య, పిల్లలు బెడ్రూమ్‌లో నిద్రిస్తున్నారు. పిస్టల్ శబ్దం విని కంగారుగా వచ్చి చూసిన భార్య రక్తపుమడుగులో ఉన్న భర్తను ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసుశాఖలో తీవ్ర సంచలనంగా మారిన ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటలకు జరిగింది. నచ్చని సామాజికవర్గమనే కారణంగా తనను డిపార్టుమెంటులో దూరం పెడుతున్నారని, మంచి పోస్టింగు ఇవ్వకుండా వేధిస్తున్నారని.. మిత్రుల వద్ద గోపాలకృష్ణ వాపోయేవాడని తెలుస్తోంది. అయితే.. పోలీసు ఉద్యోగం చేయడం ఇష్టం లేకనే గోపాలకృష్ణ ఆత్మహత్య చేసుకున్నారని పోలీసు అధికారులు చెబుతున్నారు.