PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెట్రోల్ బంక్ ను ప్రారంభించిన హోంమంత్రి తానేటి వనిత..

1 min read

పల్లెవెలుగు వెబ్ కొవ్వూరు : సత్ ప్రవర్తన కలిగిన ఖైదీలకు ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాల ద్వారా జైళ్లలోని ఖైదీలకు కూడా వారి ఆసక్తిని బట్టి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని హోంమంత్రి, రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. పోలవరం సబ్ జైలు వద్ద జైళ్ల శాఖ నిర్వహించే పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గురువారం హోంమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలవరం వంటి ఏజెన్సీ ప్రాంతంలో హెచ్‌పీసీఎల్ సంస్థ జైళ్ల శాఖతో కలిసి పెట్రోల్ బంక్ ను నిర్వహించడం శుభపరిణామం అన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవ కారణంగా జైళ్లలో పరిశుభ్రత పెరిగిందని, విశాఖపట్నంలోని సెంట్రల్‌ జైలు దేశంలోనే రెండవ పరిశుభ్రమైన జైలుగా గుర్తింపు సాధించిందన్నారు. రాష్ట్రంలోని జైళ్లను సంస్కరణ కేంద్రాలుగా మార్చి వివిధ నేరాలు చేసి జైళ్లకు వచ్చిన ఖైదీలలో పరివర్తన తేవడానికి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. ఖైదీలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. సత్ ప్రవర్తన కలిగించేలా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాల ద్వారా జైళ్లలోని ఖైదీలకు వారి ఆసక్తి, అనుభవాన్ని బట్టి శిక్షణా తరగతులు నిర్వహించడమే కాకుండా తర్వాత వారికి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నామన్నారు. యోగా శిక్షణ ద్వారా వారి మానసిక, శారీరక పరివర్తన జరుగుతుందన్నారు. జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలందరూ చెడ్డవారు కాదని.. క్షణికావేశంలో చేసిన తప్పుల వల్ల నేరస్తులుగా శిక్షను అనుభవిస్తారని తెలిపారు. అలా ఏదో ఒక నేరం చేసి జైలుకు వచ్చిన వ్యక్తులు జైలు నుంచి బయటకు వెళ్లేటప్పుడు గత జీవితాన్ని పూర్తిగా మరిచిపోయి నూతన జీవితాన్ని ప్రారంభించేలా వారిలో మార్పు వచ్చేలా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని సబ్ జైళ్లలో ఖైదీల కోసం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేసి, వాటి ద్వారా శిక్షణ ఇచ్చి అనేక మంది ఖైదీలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జైళ్ల శాఖ ఆధ్వర్యంలో గురువారం ఒపెన్ చేసిన ఈ పెట్రోల్ బంకుతో కలిపి మొత్తం 17 పెట్రోలు బంకులు నడుస్తున్నాయని వెల్లడించారు. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ఖైదీల ఆర్థికాభివృద్ధికి, సంక్షేమానికి వినియోగిస్తున్నామని హోంమంత్రి తెలిపారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖైదీల వేతనాలను పెంచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, స్థానిక ప్రజా ప్రతినిధులు, జైళ్ల శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

About Author