వ్యవసాయ భూములకు.. గుర్తింపు కార్డు..
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/10069.jpg?fit=550%2C511&ssl=1)
ఆధార్ కార్డు తరహాలో… 12 అంకెలతో కూడిన కార్డు కేటాయింపు
- వ్యవసాయ శాఖ ఏడీఏ శాలు రెడ్డి
కర్నూలు, పల్లెవెలుగు:అన్నదాతల సంక్షేమార్థం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలను మరింత పారదర్శకంగా ఆవర్తింపజేసేలా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. దేశ వ్యాప్తంగా ఆధార్ కార్డు తరహాలో 12 అంకెలతో కూడిన గుర్తింపు కార్డును వ్యవసాయ భూములకు సంబందించి రైతులకు ఇస్తున్నట్లు వ్యవసాయ శాఖ ఏడీఏ శాలు రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన ఛాంబరులో విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయ భూమి గుర్తింపు నెంబరు కోసం నమోదు చేసుకున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు తరహాలో 12 అంకెలతో ప్రత్యేక గుర్తింపు కార్డు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. ఈ గుర్తింపు కార్డు ద్వారా పిఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, క్రాప్ ఇన్సూరెన్స్ , ఇన్ పుట్ సబ్సిడీతో పాటు వివిధ పథకాలు వేగంగా వర్తించేలా ఉపయోగపడుతుందన్నారు. రైతులు తమ గ్రామంలోని సచివాలయాలకు వెళ్లి ప్రభుత్వం సూచించిన పత్రాలు అందజేయాలన్నారు. పట్టాదారు పాస్ పుస్తకం లేదా 1 బి అడంగల్ పత్రంతో పాటు ఆధార కార్డు, ఆధార్ లింక్ ఉన్న మొబైల్ నెంబరు తదితర వివరాలు ఇస్తే ప్రతి రైతుకు గుర్తింపు కార్డు ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతులు తప్పనిసరిగా ఈ గుర్తింపు కార్డును పొంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అన్ని పథకాల లబ్ధిపొందాలని ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఏడీఏ శాలు రెడ్డి వెల్లడించారు.