పేదల కడుపు నింపేదే..‘అన్నక్యాంటీన్’ : టి.జి భరత్
1 min readపల్లెవెలుగు వెబ్: సంక్షేమ పథకాలకు వేలకోట్లు ఖర్చుపెడుతున్నామంటున్న ప్రభుత్వం పేదల కడుపు నింపే అన్న క్యాంటిన్లు కొనసాగించకపోవడం దారుణమని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. గురువారం నగరంలోని 17వ వార్డులో ఒక్క రోజు అన్న క్యాంటిన్ ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లుతో కలిసి టిజి భరత్ పాల్గొన్నారు. పేదలకు ఉచితంగా అన్నం పెట్టారు. అనంతరం టి.జి భరత్ మాట్లాడుతూ పేద ప్రజల కోసం పెట్టిన కార్యక్రమాన్ని ఎందుకు తీసివేశారో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వాలు మారినప్పటికీ మంచి పథకాలైన ఆరోగ్యశ్రీ, పించన్ పథకాలను కొనసాగిస్తున్నట్లు గుర్తుచేశారు. అలాంటిది అన్న క్యాంటిన్ ఎందుకు తీసివేశారన్నారు. పక్క రాష్ట్రమైన తమిళనాడులో ప్రభుత్వం మారినా అమ్మక్యాంటిన్లు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. అనంతరం సోమిశెట్టి మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. పనులు లేక కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. టిడిపి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. ఇక టిజి భరత్ 33 వార్డుల్లో ఒక్క రోజు అన్న క్యాంటిన్లు ఏర్పాటుచేసి వీటి విలువ ప్రభుత్వానికి తెలిసేలా చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జి బాబ్జీ, వార్డు ఇంచార్జి అనంత ప్రదీప్, నేతలు వినోద్ చౌదరి , సూరి, కిశోర్, నాగన్న, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.