PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్రీడల ద్వారానే విద్యార్థులు క్రమశిక్షణ గల పౌరులుగా ఎదుగుతారు

1 min read

– కరాటే బెల్ట్ గ్రేడింగ్ పోటీలను ప్రారంభించిన సీనియర్

–  గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  క్రీడల్లో పాల్గొనడం ద్వారానే విద్యార్థులు క్రమశిక్షణ గల పౌరులుగా ఎదుగుతారని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. కర్నూల్ నగరంలోని ఎన్ఆర్ పేట లో ఉన్న శ్రీ లక్ష్మీ హై స్కూల్ ప్రాంగణంలో జరిగిన కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ ను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కరాటే శిక్షకుడు రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరాటేలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు  సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ బెల్ట్ లను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులోనూ రాణిస్తారని చెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విద్యార్థులు సెల్ ఫోన్లు, కంప్యూటర్లు వంటి వాటికి అలవాటు పడి ఎలాంటి శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల ఊబకాయం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. చిన్న వయసులోనే ఊబకాయం వల్ల రక్తపోటు, మధుమేహ వ్యాధి, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు వచ్చి ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో సాధన చేయడం వల్ల విద్యార్థులు ఆత్మ రక్షణతో పాటు ఇతరులను రక్షించే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఏ దేశ ప్రగతి అయినా తరగతి గదుల్లోనే తయారు అవుతుందని చెప్పారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వల్ల గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి జీవితంలో ఎవరయ్యే ఆటుపోట్లను ఎదుర్కొనే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రపంచంలో మానవులు, వృక్షాలు, జంతువులు ఉన్నాయని, వృక్షాలు,, జంతువులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవని, అయితే మానవులు మాత్రం ఒక దేశం లోని ప్రజలపై మరో దేశం ప్రజలు దాడులు చేసే సంస్కృతి ఉందన్నారు. రష్యా, ఉక్రైయిన్, పాలస్తీనా.. ఇజ్రాయిల్ ల మధ్య జరుగుతున్న యుద్ధం ఇందుకు నిదర్శనమని వివరించారు. ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనడం వల్ల మంచి ఆలోచన విధానం, క్రమశిక్షణ అలబడుతుందని, తద్వారా ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే సంస్కృతికి దూరంగా ఉండవచ్చు అని చెప్పారు. కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో బాలికలు సాధన చేయడం వల్ల వారి ఆత్మ రక్షణ చేసుకోవడం సాధ్యం అవుతుందని చెప్పారు. క్రీడల్లో బాలికల భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉందని తద్వారా మహిళా సాధికారత సాధ్యమవుతుందని అన్నారు. విద్యార్థుల క్రీడల్లో పాల్గొనడం వల్ల క్రమశిక్షణ, అంకిత భావం పెరిగి చెడు అలవాట్లకు దూరంగా ఉత్తమ పౌరులుగా సమాజంలో గుర్తింపు పొందుతారని వివరించారు. కర్నూల్ నగరంలో క్రీడలను ప్రోత్సహించేందుకు తాను ఎప్పుడూ ముందుంటానని, తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని సీనియర్ గ్యాస్త్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ సూచించారు.

About Author