కుష్టు వ్యాధిని సమాజం నుండి తరిమేయాలి
1 min read
కుష్టు వ్యాధి నిర్మూలన ఇంటింటి సర్వే గోడపత్రికలను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి
చర్మంపై అనుమానాస్పద మచ్చలు,పొక్కులు,రంగు మార్పులు,స్పర్శతగ్గడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చెయ్యొద్దు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లాలో కుష్టు వ్యాధిని సమాజం నుండి తరిమేయ్యాలని,ప్రాథమిక దశలోనే గుర్తించి, అవసరమైన వైద్యసేవలు, వైద్యచికిత్సలు అందించేందుకు చేపడుతున్న ఇంటింటి సర్వేను జిల్లా ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి సూచించారు. జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, కుష్టునివారణ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ నుండి 29వ తేదీ వరకు 14 రోజులు పాటు ఇంటింటి కుష్టువ్యాధి నిర్మూలన సర్వేగోడ పత్రికలను జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో
కుష్టువ్యాధి నిర్మూలన ఇంటింటి సర్వే ఇంటింటికీ వెళ్ళి నిర్వహించే సర్వేలో సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు. చర్మంపై కనిపించే అనుమానాస్పద మచ్చలు, పొక్కులు,రంగు మార్పులు, స్పర్శతగ్గడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా సర్వే సిబ్బందికి తెలియచెయ్యాలని సూచించారు. అనుమానిత కేసులను గుర్తించి దగ్గరలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేక పట్టణ ఆరోగ్య కేంద్రంలో వైద్యపరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు, చికిత్సలు అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల్లో చర్మవ్యాధులు, ముఖ్యంగా కుష్టువ్యాధిపై ఉన్న అపోహలను తొలగించి, వ్యాధి ప్రారంభదశలోనే గుర్తించి చికిత్స అందించడం ద్వారా పూర్తిగా నయం చేయవచ్చనే విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. సర్వే సందర్భంగా ఆరోగ్య సిబ్బంది అడిగే వివరాలను ప్రజలు అందించి, కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని జిల్లా కలెక్టరు విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో సర్వే సజావుగా జరిగేలా సంబంధిత శాఖలు అధికారులు సమన్వయంతో పనిచేయ్యాలని, సర్వే లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సర్వేలో వైద్యఆరోగ్యశాఖ, జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, కుష్టు నివారణ శాఖ సిబ్బందితో పాటు 1785 మంది ఆశా వర్కర్లును ఇంటింటి సర్వేలో పాల్గొంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా జాయింటు కలెక్టరు డా.యం.జె.అభిషేక్ గౌడ, అసిస్టెంటు కలెక్టరు సి.హెచ్. శ్రావణ్ కుమార్ రెడ్డి, నూజివీడు సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న, జిల్లా వైద్యఆరోగ్య అధికారి డా.యు. శోభ, జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, కుష్టు నివారణ అధికారి డా.యన్. లక్ష్మీనారాయణ, ఫిజియో థెరపిస్ట్ డా.వై.యస్. చక్రధర్, తదితరులు పాల్గొన్నారు.


