PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గుండెవ్యాధుల ర‌హిత ప్రాంతంగా తీర్చిదిద్దుతాం

1 min read

* నిజాంపేట‌, ప్రగ‌తిన‌గ‌ర్, బాచుప‌ల్లి, మియాపూర్ వాసుల‌కు ఎస్ఎల్‌జీ ఆస్పత్రి హామీ

* నెల రోజులు రూ.4,999కే యాంజియోగ్రామ్ ప్యాకేజి

* ఏడాది పాటు ఉచితంగా ల‌క్ష ఈసీజీలు

* ప్రపంచ గుండె దినోత్సవం సంద‌ర్భంగా 5కె ర‌న్‌లో ప్రక‌ట‌న‌

పల్లెవెలుగు వెబ్ హైద‌రాబాద్ : నిజాంపేట‌, ప్రగ‌తిన‌గ‌ర్, బాచుప‌ల్లి, మియాపూర్ ప్రాంతాల‌ను గుండెవ్యాధుల ర‌హిత ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు త‌మ‌వంతు కృషి చేస్తామ‌ని, ఇందుకు స్థానికులంతా కూడా స‌హ‌క‌రించాల‌ని న‌గ‌రంలోని ప్రధాన ఆస్పత్రుల‌లో ఒక‌టైన ఎస్ఎల్‌జీ ఆస్పత్రి ఛైర్మన్ దండు శివ‌రామ‌రాజు కోరారు. శుక్రవారం ప్రపంచ గుండె దినోత్సవం సంద‌ర్భంగా ఆస్పత్రి నుంచి బాచుప‌ల్లి వాట‌ర్‌ట్యాంక్, తిరిగి అక్కడినుంచి ఆస్పత్రి వ‌ర‌కు 5కె ర‌న్ నిర్వహించారు. ఇందులో ఆస్పత్రి ఈడీ డీవీఎస్ సోమ‌రాజు, ఇంట‌ర్నల్ మెడిసిన్ విభాగం మెడిక‌ల్ డైరెక్టర్ డాక్టర్ శంక‌ర్‌ కృష్ణ, ఎమ‌ర్జెన్సీ విభాగాధిప‌తి డాక్ట‌ర్ అప్పిరెడ్డి, ఇంట‌ర్వెన్షన‌ల్ కార్డియాల‌జిస్టు డాక్టర్ భానుకిర‌ణ్ రెడ్డి, కార్డియాల‌జిస్టులు డాక్టర్ వేణు, డాక్టర్ వికాస్, డాక్టర్ క‌విత త‌దిత‌రులు పాల్గొన్నారు. చుట్టుప‌క్కల ప్రాంతాల‌కు చెందిన సుమారు 800 మంది ఇందులో పాల్గొని 5 కిలోమీట‌ర్లు ప‌రుగు తీశారు. 5కె రన్‌ను ప్రారంభించిన సంద‌ర్భంగా శివ‌రామ‌రాజు మాట్లాడుతూ, గుండెవ్యాధుల‌తో ప్రపంచంలో ఏటా దాదాపు 2 కోట్ల మంది మ‌ర‌ణిస్తున్నార‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్ల‌డించింద‌న్నారు. అందుకే ఆస్పత్రికి 10 కిలోమీట‌ర్ల చుట్టుప‌క్కల ప్రాంతాలన్నింటినీ పూర్తిగా గుండెవ్యాధుల ర‌హిత ప్రాంతాలుగా తీర్చిదిద్దాల‌న్న సంక‌ల్పాన్ని ఈ ప్రపంచ గుండె దినోత్సవం రోజున త‌మ ఎస్ఎల్‌జీ ఆస్పత్రి తీసుకుంటోంద‌ని తెలిపారు. ఇందులో భాగంగా ప‌లు కార్యక్రమాల‌ను ఆయ‌న ప్రక‌టించారు. నెల రోజుల పాటు యాంజియోగ్రామ్ ప‌రీక్ష‌ల‌ను రూ.4,999కే చేసేందుకు ఒక ప్యాకేజిని ఆయ‌న ఆవిష్కరించారు. ఈ నెల రోజుల్లో వైద్యుల సూచ‌న మేర‌కు యాంజియోగ్రామ్ ప‌రీక్ష చేయించుకోవాల్సిన‌వారు ఎవ‌రైనా త‌మ ఆస్పత్రిలో కేవ‌లం రూ.4,999 చెల్లించి చేయించుకోవ‌చ్చన్నారు.

ఉచితంగా ల‌క్ష ఈసీజీలు

శుక్రవారం నుంచి మొద‌లుపెట్టి, 2024 సెప్టెంబ‌రు 29వ తేదీ వ‌ర‌కు ఉచితంగా ల‌క్ష ఈసీజీలు తీయాల‌ని నిర్ణయించిన‌ట్లు దండు శివ‌రామ‌రాజు వెల్లడించారు. ఇందుకోసం ఈ చుట్టుప‌క్కల ప్రాంతాల్లోని పార్కులు, హౌసింగ్ సొసైటీలు, అపార్టుమెంట్లలో ఉద‌యం, సాయంత్రం వైద్యశిబిరాలు నిర్వహించి, అక్కడ 20 ఏళ్లు దాటిన‌వారంద‌రికీ ఉచితంగా ఈసీజీలు తీయిస్తామ‌న్నారు. వాటిలో ఏవైనా స‌మ‌స్యల‌ను గుర్తిస్తే, ఎస్ఎల్‌జీ ఆస్పత్రిలో ఉచిత క‌న్సల్టేష‌న్ సేవ‌లు కూడా అందిస్తామ‌ని చెప్పారు.

సీపీఆర్‌లో ఉచిత శిక్షణ‌

ఈ చుట్టుప‌క్కల ప్రాంతాల్లో ఉన్నవారంద‌రికీ సీపీఆర్ (కార్డియో ప‌ల్మన‌రీ రీస‌సిటేష‌న్‌) చేయ‌డంలో ఉచితంగా శిక్షణ అందిస్తామ‌ని ఆస్పత్రి ఈడీ డీవీఎస్ సోమ‌రాజు తెలిపారు. 20 ఏళ్లు దాటిన‌వారు ఎవ‌రైనా ఇందులో పాల్గొని, త‌మ వ‌ద్ద రెండుసార్లు విజ‌య‌వంతంగా సీపీఆర్ చేయ‌గ‌లిగితే.. వాళ్లు ప్రాణాపాయంలో ఉన్నవారిని కాపాడేందుకు సీపీఆర్ చేయ‌గ‌ల‌ర‌ని ఆయ‌న వివ‌రించారు. ఇటీవ‌లి కాలంలో బ‌హిరంగ ప్రదేశాల్లో గుండెపోటుకు గురైన‌వారిని కాపాడేందుకు సీపీఆర్ చేయ‌డం వ‌చ్చిన‌వారు చాలా అవ‌స‌రం అవుతున్నార‌ని, అందువ‌ల్ల ఇందులో శిక్షణ పొందిన‌వారు ఎవ‌రైనా తోటివారి ప్రాణాలు కాపాడ‌గ‌ల‌ర‌ని తెలిపారు.

About Author