ఎమ్మెల్యే బడేటి జన్మదినోత్సవం సందర్భంగా మెగా మెడికల్ క్యాంప్
1 min read

వివరాలు తెలిపిన మీడియా కో- ఆర్డినేటర్ చల్లా ప్రసాద్, నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: సేవే సంస్కారవంతమైన ప్రజాహిత సంకల్పంగానెంచి జనాభిమానపాత్రునిగా, సమాజహితోభిలాషిగా పేరుగాంచిన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి నిరంతరం ఆ దిశగా సేవాకార్యక్రమాలను నిర్వహిస్తూ అటు ప్రజలకు, ఇటు నాయకులు, కార్యకర్తలకు స్ఫూర్తివంతంగా నిలుస్తున్నారని జిల్లా తెలుగుదేశం పార్టీ మీడియా కో – ఆర్డినేటర్ చల్లా వెంకటసత్యవరప్రసాదరావు, టిడిపి నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం పేర్కొన్నారు. ఎమ్మెల్యే బడేటి చంటి జన్మదినోత్సవం సందర్భంగా ఈ నెల 12వ తేదీ గురువారం పవర్ పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏలూరు ఆశ్రం ఆసుపత్రి వైద్యుల ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఏలూరు పవర్ పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం వారు మీడియాతో మాట్లాడారు. ఎక్కడా ఆడంబరాల జోలికి పోకుండా తాను అనుకుంటోన్న సేవా కార్యక్రమాలను ఆచరణలో పెట్టేస్తూ పిన్నల దగ్గర్నుండీ పెద్దల వరకూ అందరికీ ఉపయుక్తమైన సేవలను అందించడంలో ఎమ్మెల్యే బడేటి చంటి ముందుంటున్నారని పేర్కొన్నారు. ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ నెల 12వ తేదీ గురువారం ఏలూరు పవర్ పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆశ్రం ఆసుపత్రి వైద్యుల ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చల్లా ప్రసాద్, చోడే వెంకటరత్నం తెలిపారు. ఈ మెగా వైద్యశిబిరంలో కంటివైద్య పరీక్షలను నిర్వహించి, అవసరమైన వారికి కంటి ఆపరేషన్లను ఎమ్మెల్యే సొంత నిధులతో చేయించడంతో పాటూ కళ్ళజోళ్ళు అవసరమైన వారికి వాటిని ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, డిప్యూటి మేయర్ కర్రి శ్రీనివాస్, నాయకులు బెల్లపుకొండ కిషోర్, రెడ్డి నాగరాజు, గూడవల్లి వాసు, మంచెం మై బాబు,అమరావతి అశోక్, లంక రాజబాబు, కందుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

