PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘ కరోన’తో కలిగే.. మానసిక రుగ్మతలు…

1 min read

పల్లెవెలుగు వెబ్​: ప్రశాంతంగా ఉన్న ప్రపంచంలోకి కరోనా వైరస్ ఒక పెనుభూతంలా వచ్చి జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ వైరస్ అడవి మంటల కన్నా వేగంగా మనిషి నుండి మనిషికి వ్యాపిస్తూ ప్రపంచమంతా విస్తరించి ప్రాణాలను బలితీసుకుంటున్నందువల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆ కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న తరుణంలో అనేకమంది కరోనా మృత్యు వలయంలో చిక్కుకొని బలవ్వటం వల్ల ప్రజల్లో కరోనా పట్ల భయాందోళనలు మరియు ఒత్తిడి పెరిగిపోయి వారిలో అనేక మానసిక రుగ్మతలు చోటుచేసుకుంటున్నాయి.
వాటిలో ముఖ్యమైనవి..
అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ :
అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ను తెలుగులో ‘ స్వీయభావారోద నిర్బంధ రుగ్మ ’ అంటారు. ఇది వ్యక్తి యొక్క మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే రుగ్మత. ఓ.సి.డి ఉన్న వ్యక్తుల అనాలోచిత ఆలోచనలు చేస్తూ వుంటారు. దీని వల్ల పునరావృతమయ్యే ఆలోచనలు ఆందోళనను కలిగిస్తాయి.

  • పరిస్థితుల రీత్యా వీరిలో కొన్ని అలవాట్లు వాటంతటవే ఏర్పడి ఆ పనులు చేయకపోతే మనసు అంగీకరించదు . ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ అలవాట్లను ఆపలేని స్థితిని అబ్సెషన్ అంటారు.
    *ప్రతి వంద మందిలో మూడు నుండి అరుగురు ఓ.సి.డీ. అనే ఈ మానసిక రుగ్మతతో బాధపడుతున్నారు.
  • కరోన ఒకరి నుండి మరొకరికి వ్యాపించి సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్క ఇంటిలో అణువణువు పరిసరాలను క్రిమిరహితంగా డిస్ ఇన్ఫెక్ట్ చేయాల్సిన బాధ్యత ప్రతిఒక్కరి పై ఉండడంతో అందరిలోను అబ్ సెషన్ ఆఫ్ కాంటామినేషన్ అనే అలవాటు సాధారణమైపోయింది. చేతులు పదే పదే కడుక్కోవడం, పదే పదే పరిశుభ్రతకు సంబందించిన విషయాల్ని పరిశీలించడం, చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చెయ్యడం మరియు అతి శుభ్రత …. వీటి లక్షణాలు.
    హైపోకాండ్రియా :
    హైపోకాండ్రియా అనగా వ్యాధి గురించి ఎక్కువగా ఆలోచించుట వల్ల ఆందోళనకు గురై అదేవ్యాధి తమకు కూడా ఉందని రోగ భ్రమ కలిగి ఉండుట కరోనా వైరస్ ప్రపంచమంతటా వేగంగా వ్యాపించి ప్రజల ప్రాణాలను బలికొంటున్న ఈ తరుణంలో టెలివిజన్, వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషియల్ మీడియా ద్వారా చుట్టూ ఎటు చూసినా ఏమి విన్నా కరోనా గురించే ప్రసారం జరుగుతోంది. దీనివల్ల సాధారణ జలుబు, దగ్గు, జ్వరం, అలసట ఏ లక్షణాలు ఉన్నా వారికి కరోనా సోకిందమోనని భయపడటాన్ని “హైపోకాండ్రియా” అంటారు.
    సైబర్ కాండ్రియా.. :
    సైబర్ కాండ్రియా అంటే హైపోకాండ్రియా లక్షణాలు ఉన్న వారు మరియు హెల్త్ కేర్ అనే భావనలో నేటి యువత మరియు ఇంటర్నెట్ కలిగిన చాలామంది ఆరోగ్యం గురించి ఏ చిన్న అనుమానం ఉన్నా, ఏదైనా సమాచారం కావాలన్నా ప్రతిదానికి అనునిత్యం ఇంటర్నెట్ వాడుతూ అధిక సమయం గడుపుతూ, వారికి వారే వ్యాధి నిర్ధారణ అంటే సెల్ఫ్ డయాగ్నిసిస్ చేసుకుని భయాందోళనకు గురయ్యే ఈ మానసిక రుగ్మత సైబర్ కాండ్రియా. ఇది ఒక రకమైన ” మెడికల్ ఆంగ్జయిటీ డిజార్డర్ ” . పరిశోధన ప్రకారం.. ముఖ్యంగా యువత అనునిత్యము టెక్నాలజీతో అనుసంధానమై ప్రతిదానికి ఇంటర్నెట్ పై ఆధారపడుతూ “సైబర్ కాండ్రియా ” బారిన పడుతున్నారు.
    కరోనా వైరస్ అనేది ఎవరూ ఊహించనిరకంగా ఆకస్మికంగా సంభవించిన ఒక విపత్కర పరిణామం. దీన్ని ఎలా ఎదుర్కోవాలో ఏ మందులతో నయమవుతుందో తెలియని పరిస్థితి. కళ్ల ముందే ఎన్నో ప్రాణాలు పోతోంటే …అదే పరిస్థితి మనకు తెలిసిన వాళ్ళకో, కుటుంబ సభ్యులకో వస్తే దాని నుండి బయటపడడానికి ఎవరేమి చేస్తే అది అనుసరించే ప్రయత్నం చేయటం, దీనివల్ల అన్ని పరిస్థితుల్లో భయం ఆందోళనలతో కూడిన ప్రవర్తన సర్వసాధారణం. ముందుగా అమితమైన యాంగ్జరీతో విపరీతమైన జాగ్రత్తలు తీసుకోవటం కానీ, నిర్లప్తతలో నాకేమి జరుగదులే అనే భావంతో ఏ విషయం విన్నా దాన్ని యధాతదంగా నమ్మడం చేస్తుంటారు.. అంటి లాజిక్, రీజన్ లేకుండా ఎవరు ఏమి చేసినా అది ఫాలో అవుతుంటారు. దీన్నే “యూఫోరియా” అంటారు .
    జనో ఫొబియా :
    కరోనా మనిషి నుండి మనిషికి వ్యాపించే వ్యాధి చైనాలో మొదలైన ఈ వ్యాధి 205 ప్రపంచదేశాలను వణికిస్తోంది. అంటే వివిధ దేశాల్లో ఉన్నవారు మనదేశానికి రావటం వల్ల విదేశీయుల వల్ల ” కరోనా మనదేశలో వ్యాపించింది. అందుకే ప్రజలందరిలో కొత్త వారన్నా, విదేశీయులన్నా ఒకరకమైన భయం, విరుద్ధభావన,అపనమ్మకం అయిష్టం ఏర్పడింది. దీన్నే సైకాలజీ పరంగా” జనోఫోబియా ” అంటారు. ఈ వైరస్ ప్రభావం అంతర్జాతీయంగా అనేక దేశాల్లో విస్తరిస్తున్న కొద్దీ జాతి వివక్షత పెరుగుతోంది. ఉదాహరణకు ప్రపంచదేశాలన్నిటికీ చైనా అంటే విరుద్ధ భావన భయం ఏర్పడ్డాయి. ఒకప్పుడు జెనో ఫోబియా అనేది.. మానసిక రుగ్మత, అసాధరణభయం. అలాంటిది కరోనా ప్రభావం వల్ల ప్రతి ఒక్కరిలో సర్వసాధారణ లక్షణంగా మారిపోయింది.
    డబుల్ డిప్రెషన్ డిజార్డెర్ :
    ఆరోగ్యపరంగా కొంతమందిలో బిపి, షుగర్ ఇతం ఆరోగ్య సమస్యలు ఉండే ఏమి తినాలి. ఎలా బ్రతకాలి అనే డిప్రెషన్ తో బాధపడుతుంటారు. అలాంటి వారిలో కరీనా ప్రభావం వల్ల కొత్త డిప్రెషన్ జతకావడాన్ని “డబుల్ డిప్రెషన్ డిజార్డర్” అంటారు. టెలివిజన్, వార్తాపత్రికలు ఎక్కడ చూసిన ముసలి వాళ్ళు, 50 దాటిన వారిలో ఎక్కువగా కరోనా సోకుతుందనే ప్రచారం వల్ల వారిని భయాందోళ నలకు గురి చేస్తుంది. ముందున్న పరిస్థితికి ఇది జతవ్వడం వల్ల వారిలో మరింత పానిక్ కండిషన్ ఏర్పడుతుంది. దీన్ని “డబుల్ డిప్రెషన్ డిజార్డెర్ “అంటారు. భయం ఈ రెండు అక్షరాల పదం ఎంత బలవంతుడినైనా బలహీనుడిగా చేసేస్తుంది. బొద్దింకను చూస్తే కొందరికి భయం. బల్లిని చూస్తే మరికొందరికి భయం. అవేమీ ప్రాణాలు తీసేవి కావు. అయినా భయం.. ఇలా ఏ విషయం గురించైనా అతిగా భయపడటాన్ని ” ఫోబియా ” అంటారు. మరి ఇప్పుడు… కరోనా వైరస్ … అక్షరాలా లక్షల మంది ప్రాణాలను బలి తీసుకొని విశ్వమంతా విలవిల లాడేలా చేస్తోంది. అందుకే కరోనా వైరస్ అంటే ప్రతి ఒక్కరిలోనూ విపరీతమైన భయం ఏర్పడింది. అదే ” కరోనా పోబియా”. కరోనా వల్ల ఒక వ్యక్తి మరో వ్యక్తిని తాకాలంటే భయం… వస్తువులను తాకాలంటే భయం .. అవసరాల కోసం బయటి కెళ్ళాలంటే భయం.. బయటికెళ్ళి వచ్చిన వ్యక్తుల నుండి కరోనా సోకుతుందేమోనని కుటుంబ సభ్యులకు భయం.
    కరోనా ఆంగ్జయిటీ డిజార్డర్ :
    కరోనా వల్ల ప్రతి ఒక్కరూ క్షణక్షణం ఏదో రకమైన భయాందోళనలకు గురవుతున్నారు. ఎక్కడ పక్కవారి నుండి కరోనా తమకు సోకుతుందేమోనని , సోకితే 14 రోజులు క్వారెంటైన్ లో ఎలా ఉండాలి ? అక్కడ ఎలా ఉంటుంది. అప్పుడు కుటుంబం ఏమైపోతుంది ? అని చాలా మందిలో ఆందోళన పెరిగిపోయి ప్రశాంతంగా ఉండలేక పోతున్నారు..
    ఈ పరిస్థితిని ” కరోనా ఆంగ్జయిటీ డిజార్డర్ ” అంటారు.
  • కరోనా వైరస్ వల్ల కలిగే మానసిక రుగ్మతల్ని ఎదుర్కోవటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు*
    ప్రస్తుత పరిస్థితుల్ని అర్థం చేసుకుని అంగీకరించటమే మొదటి పరిష్కార మార్గం.
    • ఈ సమస్య మన ఒక్కరిది కాదు. యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యగా గుర్తించాలి.
    • అప్పుడే మనసులో భయం తగ్గి, మనో దైర్యం పెరుగుతుంది. అజాగ్రత్త, అతి జాగ్రత్త మరియు అతి పరిశుభ్రత రెండూ ప్రమాదకరమే.
    • ఇవి తీవ్రమైన మానసిక ఒత్తిడి మరియు మానసిక రుగ్మతలకు దారి తీస్తాయి. కాబట్టి ఈ రెండింటికీ దూరంగా ఉండాలి. వ్యాధి నిరోధకతను పెంచడానికి సమతుల్య పోషకాహారాన్ని తీసుకోవాలి. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం మరియు మనోధైర్యాన్ని పెంపొందించడానికి యోగా, ప్రాణాయామం మరియు ఇతర శారీరక వ్యాయామాలు
    చేయాలి.సామాజిక దూరాన్ని పాటిస్తూ సమాజాన్ని కాపాడుకోవాలి.

రచయిత
డాక్టర్​ ఎం. వరలక్ష్మి ,
ఎడ్యుకేషనల్​ సైకాలజిస్ట్​, ప్రభుత్వ డైట్​ కళాశాల, రాయచోటి, కడప( జిల్లా)


About Author