చిన్నారుల సందడితో కళకళలాడిన మదర్ థెరిసా పాఠశాల
1 min read
ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలతో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
హోళగుంద న్యూస్ నేడు: మండల కేంద్రమైన హోళగుందలోని మదర్ థెరిసా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శుక్రవారం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుకలు చిన్నారుల ఆటపాటలు, నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో పాఠశాల ప్రాంగణాన్ని సందడిగా మార్చాయి.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె. వీరేష్ మాట్లాడుతూ.. పిల్లలే దేశ భవిష్యత్తుకు అసలైన సంపద అని పేర్కొన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని అలవర్చుకుని విద్యలో రాణించాలని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. చిన్నారులంటే పండిట్ జవహర్‌లాల్ నెహ్రూకు ఎంతో ప్రేమ, ఆప్యాయత ఉండేవని, ఆయన జన్మదినాన్ని బాలల దినోత్సవంగా జరుపుకోవడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని విద్యార్థులకు వివరించారు.అనంతరం విద్యార్థులకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహించారు. చిన్నారులు ఉత్సాహంగా పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ, ప్రసంగాలతో తమ ప్రతిభను ప్రదర్శించారు. విద్యార్థుల ఆటపాటలు, కేరింతలు, ఆనందోత్సాహాలతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు కె. వీరేష్, ఉపాధ్యాయులు షహీన బేగం, కీర్తి, గాదిలింగప్ప, విద్యార్థులు పాల్గొన్నారు.


