పిల్లలను ఇనుప కంచె పై నుంచి విసిరేస్తున్న తల్లులు !
1 min readపల్లెవెలుగు వెబ్ : తాలిబన్ల నుంచి తప్పించుకునేందుకు ఆఫ్ఘనిస్థాన్ పౌరులు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. విమానాశ్రయం నుంచి తప్పించుకోవడానికి ఎయిర్ పోర్టు వైపు పరుగులు తీస్తున్నారు. తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నవారిని తాలిబన్లు చితకబాదుతున్నారు. తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని కాల్చేపారేశారన్న వార్తలు అంతర్జాతీయ సమాజాన్ని కలచివేస్తున్నాయి. విమానాశ్రయం వైపు రాకుండా ఆప్ఘాన్ పౌరులను తాలిబన్లు అడ్డుకుంటున్నారు. గేట్లు వేసి ఇనుప కంచెలు బిగించారు. అప్ఘాన్ లోని యూఎస్, యూకే పౌరులను తీసుకెళ్లేందుకు ఆ దేశ భద్రతా బలగాలు అప్ఘాన్ వచ్చాయి. విమానాశ్రయం సమీపంలోకి వస్తున్న అప్ఘానీ మహిళలు తమ బిడ్డలనైనా తీసుకెళ్లాలంటూ యూఎస్, యూకే బలగాలను కోరుతున్నారు. కొందరైతే ఇనుప కంచె పై నుంచి యూఎస్,యూకే బలగాల వైపు పిల్లలను విసురుతున్నారు. కొందరు పిల్లలు ఇనుప కంచెల్లో చిక్కుకుని గాయపడ్డారని బ్రిటిష్ సైనిక అధికారి ఒకరు తెలిపారు. తాలిబన్ల పాలనలో తాము బతకలేమని, తమ బిడ్డలనైనా తీసుకెళ్లమంటూ అప్ఘాన్ మహిళలు ప్రాధేయపడుతున్నారని బ్రిటిష్ సైనిక అధికారులు తెలిపారు.