6 నెలలకు మించి సస్పెన్షన్ కుదరదు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఆరు నెలలకు మించి శాసన సభ్యులను సస్పెండ్ చేయరాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. వారిని నిరవధికంగా సస్పెండ్ చేసే అపరిమిత అధికారం చట్టసభలకు లేదని జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి, సీటీ రవికుమార్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తేల్చిచెప్పింది. మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఏడాది పాటు సస్పెండ్ చేయడం పై దాఖలైన పిటిషన్లపై తాజాగా విచారణ జరిపింది. అసెంబ్లీ నిర్ణయం అప్రజాస్వామికమని.. రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఏ నియోజకవర్గమూ ఆరు నెలలకు మించి ప్రాతినిధ్యం లేకుండా ఉండరాదని గుర్తుచేసింది. అతి స్వల్ప మెజారిటీతో నడుస్తున్న ప్రభుత్వాలు.. సభ్యులను దీర్ఘకాలంపాటు సస్పెండ్ చేస్తే పరిస్థితేంటి అని ప్రశ్నించింది. ఓ సభ్యుడిని సస్పెండ్ చేయాలనుకుంటే.. సమావేశాలు జరిగేంతవరకు మాత్రమే చేయాలని స్పష్టం చేసింది.