PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ గురుకులాల్లో ప్ర‌వేశానికి నోటిఫికేష‌న్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : విజయవాడ‌ కానూరులోని మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఎంజేపీఏపీబీసీడబ్ల్యూఆర్‌ఈ) రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 99 గురుకుల పాఠశాలల్లో అయిదోతరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. విద్యార్థులను లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. విద్యార్థుల స్థానికత ఆధారంగా సంబంధిత జిల్లాకు చెందిన గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్స్‌ ఇస్తారు. బాలురు, బాలికలకు విడివిడిగా పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 5580 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేక కేటగిరీ కింద అనాథ పిల్లలకు, మత్స్యకారుల పిల్లలకు ప్రవేశాలు కల్పిస్తారు.

గురుకులాల ప్రత్యేకతలు: డిజిటల్‌ తరగతులతో ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది. ఉచిత వసతి సౌకర్యం కల్పిస్తారు. నాలుగు జతల యూనిఫాం, టై, బెల్ట్‌, బూట్లు, సాక్స్‌, రెండు దుప్పట్లు ఇస్తారు. పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్‌లు, ప్లేట్‌, గ్లాస్‌, సమీకృత పౌష్టికాహారం అందిస్తారు. క్రీడలలో శిక్షణ ఇస్తారు. ఇక్కడ గ్రంథాలయాలు, ప్రయోగశాలలు ఉంటాయి. అయిదోతరగతిలో ప్రవేశం పొందిన విద్యార్థులు ఇంటర్‌ వరకూ ఇక్కడే చదువుకొనే అవకాశం ఉంది

అయిదు, ఆరు తరగతులు చదివే బాలురకు నెలకు రూ.100; ఏడు నుంచి ఇంటర్‌ వరకు చదివేవారికి నెలకు రూ.125లు ఇస్తారు. సెలూన్‌ ఖర్చుల నిమిత్తం నెలకు రూ.30 ఇస్తారు. అయిదు నుంచి ఏడోతరగతి వరకు చదివే బాలికలకు నెలకు రూ.110; ఎనిమిది నుంచి ఆపై చదివే బాలికలకు నెలకు రూ.160లు చెల్లిస్తారు.

అర్హత: గుర్తింపు పొందిన పాఠశాలలో 2020-21 విద్యా సంవత్సరంలో మూడోతరగతి, 2021-22 సంవత్సరంలో నాలుగోతరగతి చదివి ఉండాలి. ఓసీ, బీసీ, ఈబీసీ విద్యార్థులు 2011 సెప్టెంబరు 1 నుంచి 2013 ఆగస్టు 31 మధ్య; ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 2009 సెప్టెంబరు 1 నుంచి 2013 ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలి. కుటుంబ వార్షికాదాయం రూ.1,00,000లు మించకూడదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ : ఏప్రిల్‌ 27

వెబ్‌సైట్‌: apgpcet.apcfss.in/MJPAPBCWR

                                         

About Author