పత్తికొండలో…ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు
1 min readపల్లెవెలుగు: పత్తికొండలో ఆదివారం విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ నందమూరి తారక రామారావు అభిమానులు తమ ప్రియతమ నేత ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు అభిమానులు పట్టణంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ సర్కిల్లో నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పత్తికొండ పట్టణంలోని శారద వృద్ధాశ్రమంలో నందమూరి అభిమానులు వృద్ధులకు బట్టలు పంపిణీ చేశారు. అలాగే ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఇక్కడ ఏర్పాటుచేసిన సేవా కార్యక్రమంలో నందమూరి తారక రామారావు అభిమానులు తమ ప్రియతమ నాయకునికి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను, తెలుగుజాతికి తీసుకువచ్చిన కీర్తి ప్రతిష్టలను గుర్తు చేసుకున్నారు. తెలుగు పండితులు, కవి జయ చంద్రుడు ఎన్టీఆర్ నట కీర్తిని కొనియాడారు. ఎన్టీఆర్ ఒక యుగపురుషుడని, వెండితెరపై రాముడు కృష్ణుడు దుర్యోధనుడు వెంకటేశ్వరుడు కీచకుడు అన్ని తానై ప్రతిబింబించిన నటసార్వభౌముడు ఎన్టీఆర్ కే సాధ్యపడిందన్నారు. పేద ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిన ఘనత చెందిన విశిష్ట నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఆయనకు ఆయనే సాటి అని, తెలుగు జాతి గౌరవ ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా దశ, దిశల ఇనుముడింపజేసిన మహా నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సీనియర్ లాయర్ సురేష్ కుమార్ ఎన్టీఆర్ పై ఉన్న తన అభిమానాన్ని చాటుకున్నారు. ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షులు సింగం శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్టీఆర్ పేదల పెన్నిధి అని అన్నారు.