PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైతులను నట్టేట ముంచిన “నూజివీడు గోల్డ్ “

1 min read

– నకిలీ పత్తి విత్తనాలతో 300ఎకరాల్లో పంట నష్టం..
పల్లెవెలుగు, వెబ్​ నందికొట్కూరు: నకిలీ విత్తనాలతో రైతులు నట్టేట మునిగారు. రూ.లక్షల్లో పెట్టిన పెట్టుబడి మట్టిపాలు కావడంతో గగ్గోలు పెడుతున్నారు.నకిలీ పత్తి విత్తనాలతో 300 ఎకరాలలో పంట నష్టం వాటిల్లిందని నకిలీ విత్తనాలను విక్రయించి న డీలర్ల పై చర్యలు తీసుకోవాలని కోరుతూ మిడుతూరు మండలం వీపనగండ్ల గ్రామ రైతులు స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు.బుధవారం వీపనగండ్ల గ్రామానికి చెందిన దాదాపు 30మంది రైతులు వ్యవసాయ కార్యాలయం ముందు బైఠాయించారు. తమకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. విపనగండ్ల గ్రామానికి చెందిన రవి, శ్రీనివాసులు, శ్రీధర్, మద్దిలేటి, ఖాలీల్, ప్రతాప్ రెడ్డి, దస్తగిరి, శంకర్, బుజ్జి, రవి, ఆంజనేయులు, తోపాటు మరో 30 మందికి పైగా రైతులు నందికొట్కూరు శ్రీనివాస ట్రేడర్స్, కర్నూలు లోని సాయిరాం సీడ్స్ పత్తి విత్తనాల డీలర్‌ వద్ద పత్తి విత్తనాలు కొనుగోలు చేశారు. ఎకరాకు రూ.30వేలు చొప్పున పెట్టుబడి పెట్టి, లక్షల రూపాయలు ఖర్చు చేశారు.పంట సాగు చేసి మూడు నెలలు అవుతుందని, ఎన్ని ఎరువుల మందులు వాడినా పంట ఎదుగుదల లేదని, పూత పట్టకపోవడంతోపాటు చెట్టుకు కాయలకు రాలేదు. సదరు వ్యాపారి వద్దకు వెళ్లి రైతులు ప్రశ్నించగా కంపెనీకి చెందిన ప్రతినిధులు వస్తారని, నెల రోజులుగా నచ్చజెబుతూ, తీరా ఇప్పుడు చూస్తే మొహం చాటేశాడన్నారు. దీంతో మోసపోయామని తెలుసుకొని వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేసినట్లు బాధిత రైతులు తెలిపారు.బుధవారం నందికొట్కూరు ఏడీఏ విజయ శేఖర్ కు రైతులు ఫిర్యాదు చేశారు .రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టిన సదరు వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకొని కేసు నమోదు చేయాలని కోరుతున్నారు. దీనిపై ఏడీఏ విజయ శేఖర్ ను, వ్యవసాయాధికారి వీరు నాయక్ ను వివరణ కోరగా విషయం తమ దృష్టికి వచ్చిందని, సైంటిస్టులతో కలిసి పరిశీలించి. ఫలితాల్లో నకిలీవి అని తేలితే సంబంధిత డీలర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు.

About Author