నటి వాణిశ్రీ స్థలం కబ్జా.. విడిపించిన సీఎం
1 min readపల్లెవెలుగువెబ్: అప్పుడెప్పుడో కబ్జాకు గురైన తెలుగు, తమిళ సీనియర్ నటి వాణిశ్రీ భూమి తిరిగి ఆమె సొంతమైంది. దాదాపు రూ. 20 లక్షల విలువైన ఈ భూమిని కొందరు నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకోగా, దానిని రద్దు చేసిన స్టాలిన్ ప్రభుత్వం నిన్న ఆ భూమిని తిరిగి వాణిశ్రీకి అందించింది. ముఖ్యమంత్రి స్టాలిన్ స్వయంగా భూమి పత్రాలను ఆమెకు అందించారు. మొత్తం ఐదుగురి భూములను కబ్జాదారుల చెర నుంచి విడిపించి వాటిని తిరిగి యజమానులకు అందించారు. అందులో వాణిశ్రీ ఒకరు. భూమి పత్రాలను తీసుకునేందుకు సచివాలయానికి వచ్చిన వాణిశ్రీ మాట్లాడుతూ.. రూ. 20 లక్షల విలువైన తన భూమిని నకిలీ పత్రాలతో కబ్జా చేశారన్న విషయం తెలిసి తన ఆస్తి పోయిందనే అనుకున్నానని, ఆశలు వదిలేసుకున్నానని అన్నారు. అయితే, గతేడాది నకిలీ పత్రాల ద్వారా జరిగిన భూ రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారాన్ని తీసుకొచ్చి తన భూమిని తనకు ఇప్పించినందుకు సీఎం స్టాలిన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తాను 11 ఏళ్లుగా తిరిగి తిరిగి అలసిపోయానని, ఇకపై పైసా కూడా ఖర్చు పెట్టకూడదని అనుకున్న సమయంలో ముఖ్యమంత్రి కల్పించుకుని తన భూమిని తిరిగి ఇప్పించారని పేర్కొన్నారు.