ఎన్టీఆర్ ఆశయాలు నెరవేర్చడం చంద్రబాబుకే సాధ్యం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: దివంగత నేత ఎన్టీఆర్ ఆశయాలు నెరవేర్చడం ఒక్క చంద్రబాబు నాయుడుకే సాధ్యపడుతుందని కర్నూల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జీ టిజి భరత్ అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో పార్లమెంట్ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఇతర నేతలతో కలిసి ఆయన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్షయ బ్లడ్ బ్యాంకులో ఏర్పాటు చేసిన లెజెండరీ బ్లడ్ డోనేషన్ క్యాంపును ప్రారంభించారు. అంతకుముందు భరత్ మాట్లాడుతూ తెలుగు ప్రజలందరినీ ఏకతాటిపైకి తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. పేద ప్రజలు కడుపునిండా అన్నం తినాలన్న ఉద్దేశంతో రూ.2 కే కిలో బియ్యం ఇచ్చారని గుర్తు చేశారు. పార్టీ స్థాపించిన తక్కువ కాలంలోనే అధికారంలోకి తీసుకొచ్చారని చెప్పారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ఇవ్వాలని కోరారు. ఇక ఎన్టీఆర్ పేరున్న హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడం మంచిది కాదన్నారు. దీనివల్ల విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేసే వారికి చాలా ఇబ్బందులు వస్తాయన్నారు. ఎన్టీఆర్ పేరుతో చంద్రబాబు పెట్టిన అన్న క్యాంటీన్లను కూడా ప్రభుత్వం కొనసాగించలేదన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుపడుతుందన్నారు.