కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే పై జనం ఆగ్రహం !
1 min readపల్లెవెలుగువెబ్ : నంద్యాల జిల్లా పాణ్యం మండలం పిన్నాపురంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, తహసీల్దార్ నాగమణి ఇతర అధికారులను గ్రామస్థులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో తీవ్ర ఆగ్రహానికి గురైన గ్రామస్థులు రాళ్లు రువ్వడంతో తహశీల్దార్‌కు స్వల్ప గాయాలయ్యాయి. జల విద్యుత్, పవన, సౌర విద్యుత్ ప్రాజెక్టుల్లో భాగంగా పిన్నాపురంవాసులు భూములు కోల్పోయారు. అంతేగాకుండా అక్కడ జరుగుతున్న బ్లాస్టింగ్ పనుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో సర్పంచ్ వెంకటకృష్ణ అధ్యక్షతన బుధవారం ఆంజనేయస్వామి ఆలయం వద్ద గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే, అధికారులు వస్తున్నారని తెలుసుకున్న గ్రామస్థులు సభను బహిష్కరించారు. గ్రామానికి పక్కనే కుంట సమీపంలో గ్రీన్‌కో సంస్థ నిర్మిస్తున్న జలవిద్యుత్ నీటి స్టోరేజీ పనులను అడ్డుకున్నారు. తమ భూములు పోతున్నాయని, పరిహారం ఇవ్వడంలో పాలకులు, అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారంటూ మండిపడ్డారు. భూములు కోల్పోయిన తమకు ఎకరాకు రూ.15 లక్షల పరిహారం ఇవ్వాలని ఎమ్మెల్యేను డిమాండ్ చేశారు. ఈ సమయంలోనే కొందరు రాళ్లు రువ్వడంతో తహసీల్దారు నాగమణి తలకు స్వల్ప గాయాలయ్యయి. ఆందోళనకు దిగిన గ్రామస్థులను పోలీసులు చెల్లాచెదురు చేశారు.