ఎరువుల సరఫరాలో ఇబ్బందులు తలెత్తరాదు
1 min read– వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షించిన మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: రానున్న వర్షాకాలంలో ఎరువులు సరఫరా, నిల్వ గురించి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ, రైల్వే, ఎరువుల కంపెనీలు, మార్క్ ఫెడ్ అధికారులతో జూమ్ ద్వారా నిర్వహించిన సమీక్షలో మంత్రి నిరంజన్ రెడ్డి వివిధ అంశాలను ప్రస్తావించారు. రానున్న వానాకాలానికి 25.50 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను కేటాయించినట్టు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం అందుబాటులో 6.65 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు, మరో 3.73 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 2.92 లక్షల మెట్రిక్ టన్నుల ఇతర ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో గత వానాకాలం అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
నిల్వ.. సామర్థ్యం పెంచాలి: మార్క్ ఫెడ్ లో ఉన్న బఫర్ స్టాక్ నిల్వలను జిల్లాల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాలకు తరలించి నిల్వ సామర్ద్యం పెంచుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు బఫర్ స్టాక్ తగ్గకుండా చూసుకోవాలని సూచించారు.కొత్తగా నిర్మించిన వేర్ హౌసింగ్ గోడౌన్లు 15 రోజులలో అందుబాటులోకి వస్తాయన్నారు. వరంగల్, ఖమ్మం, వనపర్తిలలో కొత్త గోడౌన్లను ఎరువుల నిల్వకు వినియోగించుకోవాలని, సీజన్ ముందే ప్రారంభమయ్యే ఆదిలాబాద్, కరీంనగర్ , నిజమాబాద్ వంటి జిల్లాలకు ఎరువులను ముందే తరలించాలని చెప్పారు. ఇక వ్యవసాయ శాఖ, మార్క్ ఫెడ్ ఉద్యోగులకు కరోనా టీకా వేయించేందుకు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శికి మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి రైతులకు ఎరువుల సరఫరాలో ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.