ఈనెల 27,28 న వాహనాల బహిరంగ వేలం
1 min read– జిల్లా ఉపరవాణా కమిషనర్ యం పురేంద్ర
పల్లెవెలుగు, వెబ్ విజయవాడ: రికార్డులు లేకుండా తిరుగుతూ పట్టుబడ్డ వాహనాలను ఈ నెల 27, 28 తారీఖులలో బహిరంగ వేలం వెయ్యనున్నట్లు జిల్లా ఉపరవాణా కమిషనర్ యం పురేంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక బందరు రోడ్డులోని ఉపరవాణా కమిషనర్ కార్యాలయం నుండి మంగళవారంనాడు ఒక పత్రిక ప్రకటనను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఉపరవాణా కమిషనర్ యం పురేంద్ర మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన వాహన తనిఖీల్లో రికార్డులు లేకుండా పట్టుబడ్డ వాహనాలను సీజ్ చెయ్యడం జరిగిందని, సీజ్ చేసిన వాహనాలకు నోటీసులు ఇచ్చిన కూడా యజమానులు ఎవ్వరు రాకపోవడంతో ఈనెల 27, 28 తారీఖులలో సీజ్ చేసిన వాహనాలను బహిరంగ వేలం వెయ్యనున్నట్లు ఉప రవాణా కమిషనర్ యం పురేంద్ర తెలిపారు. ఈ నెల 27న ఉదయం 10 గం,, ల నుండి కానూరు సాంబశివ రావు యార్డ్ నందు అదే రోజు మధ్యాహ్నం 2 గం,, ల నుండి జిల్లా ఉపరవాణా కమిషనర్ కార్యాలయం విజయవాడ నందు, 28న ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో నందు వేలం నిర్వహించబడునని ఆయన తెలిపారు. కానూరు సాంబశివరావు యార్డ్ నందు మోటార్ సైకిల్స్ –11, ట్రాక్టర్ ట్రైలర్ -1, ఆటో రిక్షాల-1, మూడు చక్రాల గూడ్స్ వాహనం -1, మోటార్ క్యాబ్స్ -1, ఓమ్ని బస్సు-1, జిల్లా ఉపరవాణా కమిషనర్ కార్యాలయం నందు మోటార్ సైకిల్స్- 13, ఇబ్రహీంపట్నం బస్సు డిపోనందు మోటార్ సైకిల్స్- 5, బోలేరా కార్-1, ఆటో రిక్షాలు-4, మ్యాక్సీ క్యాబ్ -1 వేలంలో ఉన్నాయని, మొత్తం 42 వాహనాలన్నారు. వాహనాల వేలంనకు ముందు ధరావత్తు సొమ్ముగా ఐదు వేల రూపాయిలు నగదును చెల్లించి గుర్తింపు కార్డుల ఫోటో స్టాట్ కాపీని ఇవ్వాలన్నారు. వేలంలో వాహనాలను పాడుకున్న రోజే మొత్తం సొమ్మును చెల్లించాలన్నారు. అదేరోజు చెల్లించని యెడల ధరావత్తు సొమ్ముగా చెల్లించిన ఐదు వేల రూపాయలను తిరిగి ఇవ్వబడదని, అదే వాహనాన్ని మరల తిరిగి వేలం నిర్వహించడం జరుగుతుందని ఉపరవాణా కమిషనర్ తెలిపారు. వేలంలో పాడుకున్న వాహనాలకు జిఎస్టి పన్నును చెల్లించి వాటి రశీదును ఉపరవాణా కమిషనర్ కార్యాలయంలో అందజేయాలన్నారు. బహిరంగ వేలం నిర్వహిస్తున్న వాహనాలకు సంబందించి యజమానులు గాని సంబందిత ఫైనాన్షియల్స్ గాని ప్రభుత్వానికి చెల్లించవలసిన బకాయలను వాహనాల వేలంనకు ముందు రోజులోపు కార్యాలయంలో సంబంధిత అధికారులను సంప్రదించి చెల్లించవచ్చన్నారు. వాహనాల బహిరంగ వేలంను కూడా నిలుపుదల చేసే అధికారం అక్కడ వేలం నిర్వహించే అధికారులకు ఉందని ఉప రవాణా కమిషనర్ యం పురేంద్ర తెలిపారు.