రాముడంటే నిలువెత్తు ఆదర్శం
1 min read– విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి మాళిగి భానుప్రకాష్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: హరిశ్చంద్ర శరీన్ నగర్ లోని జమ్మిచెట్టు కట్ట వద్ద ఈ రోజు సా. 6:00 గం.లకు విశ్వ హిందూ పరిషత్ ప్రఖంఢ మాతృశక్తి కన్వీనర్ శ్రీమతి విజయలక్ష్మి ఆధ్వర్యంలో కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన రామోత్సవం లో ముఖ్య అతిథి గా పాల్గొన్న విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా కార్యదర్శి మాళిగి భానుప్రకాష్ మాట్లాడుతూ ..దశావతారాలలో 7 వ అవతారమైన రామావతారం లో శ్రీ మహావిష్ణువు మానవ రూపంలో భూమిపై జన్మించి , మానవుడు ఒక కొడుకుగా,అన్నగా,భర్తగా,రాజుగా ధర్మంగా ఎలా జీవించాలో జీవించి చూపిన మహానుభావుడు శ్రీరామ చంద్రుడు అందుకే ” రామోవిగ్రహవాన్ ధర్మః ” అన్నది ఆర్యోక్తి. అంటే రాముడు ధర్మానికి ప్రతిరూపమని అర్థం…ఆ శ్రీరామ చంద్రుని గుణగణాలను తెలుసుకోవాలంటే ఎన్నో ఉన్నాయి వాటిలో ఒక అద్భుతమైన గుణం పితృవాక్య పరిపాలన(తండ్రి మాట జవదాటక పోవడం)… తెల్లవారితే శ్రీరాముని పట్టాభిషేకం జరుగుతుందని అయోధ్యా వాసులందరూ సంబరాలు జరుపుకుంటున్న వేళ దశరథ మహారాజు ఒకానొక సందర్భంలో తన మూడవ భార్య కైకేయి తనకు ఇచ్చిన మాట (వరాల) కోసం పట్టుబడితే … పట్టాభిషేకానికి సిద్ధపడుతున్న తన జ్యేష్ట పుత్రుడైన శ్రీరాముడిని పిలిచి 14 సం.లు వనవాసానికి వెళ్ళమని దశరథ మహారాజు అయిష్టంగానే ఆదేశిస్తే ఒక్క నిమిషం కూడా తటపటాయించకుండా,చిరునవ్వుతో ” మీ ఆజ్ఞ ” నాన్నగారూ అని ఏమాత్రం ఆలోచించకుండా వనవాసానికి వెళ్ళిపోయాడు ఆ శ్రీరాముడు. ఈ వృత్తాంతం లో తండ్రి మాట తనకు నచ్చినా…నచ్ఛక పోయినా తండ్రి మాట జవదాటరాదన్న ధర్మం కోసం రాముడు జీవించి ఆదర్శంగా నిలిచాడని కాబట్టి నేటి యువత,నేటి తండ్రులు ఆ శ్రీరాముని ఆదర్శంగా తీసుకుని జీవిస్తే తండ్రీ కొడుకుల బంధం చిరకాలం నిలుస్తుందని తెలియజేశారు. ఈకార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి కన్వీనర్ శ్రీమతి భార్గవి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీరాముడికి హారతి ఇచ్చి పానకం, వడపప్పు ప్రసాదంగా వితరణ చేశారు.మాతృమూర్తులు,స్థానిక పురుషులు పాల్గొన్నారు.