PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని ఆర్డీవో కార్యాలయం ముట్టడి 

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ఏపీ మోడల్ పాఠశాల కళాశాలలో ఖాళీలను భర్తీ చేయాలని   ఏ ఐ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఆర్డిఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఏపీ మోడల్ పాఠశాల, కళాశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని కోరుతూ, పెద్ద ఎత్తున విద్యార్థులు తరగతులు బహిష్కరించి పాఠశాల నుండి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చారు. అనంతరం కార్యాలయం ముందు విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు అల్తాఫ్ మాట్లాడుతూ,పత్తికొండ ఏపీ మోడల్ స్కూల్ లో మరియు కాలేజీల్లో విద్యార్థులకు బోధించడానికి బోటనీ, మాథెమాటిక్స్,  జోయోలాజి, ఇంగ్లీష్ అలాగే అటెండర్ల పోస్టులు ఎంతోకాలంగా ఖాళీగా ఉన్నాయన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఎన్నో సార్లు అధికారులకు వినతి పత్రాలు అందించినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఏపీ పాఠశాల మరియు కళాశాలలో 600 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉండగా విద్యార్థులకు అధ్యాపకులు లేక సరిగా విద్యను అభ్యసించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు అధ్యాపకులు లేని కారణంగా ఉత్తీర్ణత శాతం పూర్తిగా పడిపోయిందన్నారు. ఈ విద్యా సంవత్సరం కూడా  మొదలై నాలుగు నెలలు కావస్తున్నా  ఏపీ మోడల్ స్కూల్లో ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయలేకపోవడం చాలా సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికైనా విద్యాధికారులు ముద్దు నిద్ర వీడి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని కోరారు. జూన్ నెల నుంచి ఎంఈఓ, ఎమ్మార్వో, ఆర్డీవో గారికి వినతి పత్రాలు అందించినప్పటికీ, వినతి పత్రాలు చెత్త బుట్టలోకి పోతున్నాయి తప్ప విద్యార్థుల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టి విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేద్దామన్న ఆలోచన అధికారులకు పట్టడం లేదని తెలిపారు.  ఇప్పటికైనా అధికారులు  వీలైనంత త్వరగా ఉపాధ్యాయులను నియమించకపోతే చలో కలెక్టరేట్ కి పిలుపునిస్తామని ఆయన హెచ్చరించారు. వినతి పత్రం అందించిన అనంతరం స్పందించిన ఆర్డీవో మోహన్ దాసు వీలైనంత త్వరగా విద్యార్థులు చదువు దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయులు నియమించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు నజీర్, మండల అధ్యక్ష కార్యదర్శి సమీర్, శివ,  పట్టణ అధ్యక్ష కార్యదర్శి వినోద్, రమేష్, నాయకులు మల్లికార్జున, పవన్, ఉపేంద్ర, మహేష్, రోషన్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

About Author