రిజర్వేషన్లు చెల్లవు !
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు 100 శాతం రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. ఝార్ఖండ్‌లో 13 షెడ్యూల్డు జల్లాల్లోని గ్రూపు-3, గ్రూపు-4 జిల్లా స్థాయి ఉద్యోగాలు అన్నింటినీ స్థానికులకే ప్రత్యేకిస్తూ 2016లో ఆ రాష్ట్ర ప్రభు త్వం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. ఇదే విషయాన్ని పేర్కొంటూ గతంలో ఝార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. స్థానికత ఆధారంగా రిజర్వేషన్లు కల్పించే విషయమై చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకే తప్ప, రాష్ట్రాల శాసన సభలకు లేదని తెలిపింది. 100 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులకు విరుద్ధమని, ఇతర ప్రాంతాల వారికి నష్టం కలుగుతుందని జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ బి.వి.నాగరత్నల ధర్మాసనం పేర్కొంది.