నాడు – నేడు పనుల పై విద్యాశాఖ అధికారులతో సమీక్ష
1 min read– జిల్లా పరిషత్ చైర్మన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని అందరు జిల్లా మరియు మండల విద్యా శాఖ అధికారులతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ జిల్లా పరిషత్ కార్యాలయపు సమావేశ మందిరం నందు విద్యా శాఖ పై సమీక్షా సమావేశము నిర్వహించారు. సదరు సమావేశము నందు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నాడు – నేడు పనుల పురోగతి, 2023-24 సంవత్సరము పదవతరగతి విద్యార్ధుల ఉత్తీర్ణత పెంపుదలకు తీసుకొనవలసిన చర్యల, విద్యార్ధుల డ్రాపవుట్లపై దృష్టి పెట్టుట, మధ్యాహ్న భోజనము, పాఠశాలలో పారిశుధ్యం, బాలికలకు శానిటరీ నాప్కిన్స్ పంపిణి, ఐరన్ లోపం గల విద్యార్ధులకు ఐరన్ టాబ్లెట్ల పంపిణి, జి.ఇ.ఆర్. సర్వేయ్ వంద శాతం పూర్తి చేయుట, బైజుస్ టాబ్లెట్లను విద్యార్ధులు విధ్యేతర ఆవాసరాలకు ఉపయోగించకుండా తీసుకోవలసిన చర్యలుపై, తరగతిలో వెనుక బడిన విద్యార్ధులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఒక ఉపాధ్యాయుడు వారిని దత్తత తీసుకొని ప్రత్యేక తరగతులు నిర్వహించవలసినదిగా జిల్లా విద్యా శాఖాధికారులకు సూచించారు. పై విషయముల సమగ్ర అమలు గురించి మండల విధ్యాశాఖాధికారులతో తరచుగా సమీక్షా సమావేశాలు నిర్వహించాలని జిల్లా అధికారులకు చైర్ పర్సన్ సూచించారు. 10 వ తరగతి విద్యార్థుల ఉత్తమ ఫలితాల కొరకు ప్రత్యేక తరగతులు నిర్వహించి గత సంవత్సరం కంటే మెరుగైన ఫలితాలు తీసుకురావటానికి ఉపాధ్యాయులు మరియు విద్యాశాఖ అధికారులు సమిష్టిగా ప్రణాళికలను రచించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కే.ఎస్.ఎస్.సుబ్బారావు, జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎస్. నిర్మల జ్యోతి, ఏలూరు జిల్లా విద్యా శాఖాధికారి పి.శ్యాం సుందర్, పశ్చిమ గోదావరి జిల్లా విద్యా శాఖాధికారి ఆర్ వెంకట రమణ, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని 48 మండలాల విద్యా శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.