(ఐఎస్ఎంఏ) అధ్యక్షుడిగా మండవ ప్రభాకర్ రావు ఎంపిక
1 min readనూజివీడు సీడ్స్ లిమిటెడ్ అధినేతకు మరో గౌరవం
పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్: ఇండియన్ షుగర్ అండ్ బయో ఎనర్జీ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) కొత్త అధ్యక్షుడిగా మండవ ప్రభాకర్ రావు ఎంపికయ్యారు. ఆదిత్య ఝున్‌ఝున్‌వాలా నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. న్యూఢిల్లీలో ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ 89వ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఆ సమావేశంలోనే ఇండియన్ షుగర్ మిల్స్ పేరును ఇండియన్ షుగర్ అండ్ బయో ఎనర్జీ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ)గా మార్చారు. ఐఎస్ఎంఏ ఉపాధ్యక్షుడిగా ధామ్‌పూర్ బయో ఆర్గానిక్స్ లిమిటెడ్ (డీబీఓ) మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ గోయల్ ఎంపికయ్యారు. మండవ ప్రభాకర్‌రావు హైదరాబాద్‌లోని నూజివీడు సీడ్స్ లిమిటెడ్ (ఎన్ఎస్ఎల్) గ్రూప్, ఎన్ఎస్ఎల్ షుగర్స్ లిమిటెడ్ గ్రూప్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఎన్ఎస్ఎల్ షుగర్స్ సంస్థకు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలలో యూనిట్లు ఉన్నాయి. ఇవన్నీ కలిపి రోజుకు 40వేల టన్నుల సామర్థ్యం కలిగి ఉన్నాయి. వీటితో పాటు 150 మెగావాట్ల విద్యుత్, డిస్టిలరీల నుంచి 500 కేఎల్‌పీడీ ఉత్పత్తులు వస్తాయి. భారతదేశంలో చక్కెర పరిశ్రమ ఇంధనం దిశగా మార్పు చెందడానికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఆ పరిశ్రమ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆహారశాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా ఐఎస్ఎంఏ వార్షిక సర్వసభ్య సమావేశంలో చెప్పారు. సుస్థిర సాధన, సాంకేతిక పురోగతితోనే ఇది సాధ్యమన్నారు. ఇక తమ పేరులో బయో ఎనర్జీని చేర్చడం ఒక దూరదృష్టితో కూడిన చర్య అని ఐఎస్ఎంఏ ఒక ప్రకటనలో తెలిపింది. “చక్కెర పరిశ్రమకు నిరంతరం పెరుగుతున్న విస్తృతిని, దేశంలో మారుతున్న ఇంధన అవసరాల్లో.. బయో ఎనర్జీకి పెరుగుతున్న ప్రాముఖ్యాన్ని ఐఎస్ఎంఏ గుర్తించింది. ఈ మార్పుతో చక్కెర, ఇథనాల్, ఇతర ఉప ఉత్పత్తుల కోసం పెరిగిన డిమాండును తీర్చడానికి చెరకు దిగుబడి, విస్తీర్ణాన్ని స్థిరమైన రీతిలో పెంచడానికి ఐఎస్ఎంఏ పనిచేస్తుంది. తద్వారా వాటాదారులు, రైతులు, వినియోగదారులు, పరిశ్రమకు ప్రయోజనం చేకూరుతుంది” అని ఐఎస్ఎంఏ ఓ ప్రకటనలో వివరించింది.