PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లాను అన్ని రంగాలలో ప్రగతి పథంలో నడిపించాలి

1 min read

– ఏలూరు జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : స్వాతంత్ర్యోద్యమంలో ప్రాణాలర్పించిన ఎందరో త్యాగమూర్తుల త్యాగాలను స్మరించుకుంటూ జిల్లాను అన్ని రంగాలలో ప్రగతిపథంలో ఉంచేందుకు అందరం పునరంకితం కావాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ పిలుపునిచ్చారు. 74వ గణతంత్ర దినోత్సవ సంబరాలు స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో గురువారం అంగరంగ వైభవంగా జరిగాయి. కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ముందుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలు జరుగుతున్న ప్రగతిపై కలెక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ గణతంత్ర దేశంగా ఆవిర్భవించి 74 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభసందర్భంలో సంపూర్ణ స్వేచ్ఛ, సమానత్వం, న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఒక హక్కుగా పొందడం జరిగిందనే విషయాన్ని ఏ ఒక్కరూ మరవకూడదన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించిన ఆనాటి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను నేటి తరం వారు స్మరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పేదలందరికీ సంతృప్తి స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, వ్యవసాయ రంగంతోపాటు నీటిపారుదల, విద్య, వైద్యం, మహిళల సంక్షేమం, పారిశ్రామికాభివృద్ధి, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించామన్నారు. పేదల జీవన ప్రమాణాల స్థాయిని పెంచడమే నవరత్నాల కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. పేదరికమే ప్రామాణికంగా అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ కార్యక్రమాలను అందిస్తున్నామన్నారు. వ్యవసాయం ప్రధానంగా ఉన్న జిల్లాలో రైతుకు అన్నివిధాలా వెన్నుదన్నుగా నిలుస్తున్నామని, జిల్లాలోని 540 రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందుబాటులో ఉంచుతున్నామన్నాయి, ఏటా 623 కోట్ల రూపాయల సబ్సిడీతో సాగుకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు.
రైతు భరోసా సాయంగా లక్షా 94 వేల మంది రైతులకు 223 కోట్ల రూపాయలను అందించామని, 7 వేల 407 కోట్ల రూపాయలను పంట రుణాలుగా అందిస్తున్నామన్నారు. 42 వేల 139 మంది కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు అందించి, 41.64 కోట్ల రూపాయలు సాగుకు రుణాలుగా అందించామని, ఉచిత వ్యవసాయ భీమా పధకం కింద 10.66 కోట్ల రూపాయలను పెట్టుబడి రాయితీగా నేరుగా రైతుల ఖాతాలకు జమచేశామన్నారు. ఆక్వా హబ్ లు ఏర్పాటుచేసేవారికి ప్రోత్సాహకాలను అందిస్తున్నామని, ఉద్యానవన రైతులకు 40 కోట్ల రూపాయలను వివిధ పధకాల కింద రాయితీలుగా అందిస్తున్నామని, 6 వేల హెక్టర్లలలో బిందు మరియు తుంపర సేద్యమునకు 41 కోట్ల రూపాయలు సబ్సిడీగా అందిస్తున్నామన్నారు.
పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు పునరావాస ప్యాకేజ్ ని త్వరితగతిన పూర్తిచేసి, నిర్వాసితులను పునరావాస కాలనీలకు తరలిస్తున్నామని, నిర్వాసితులకోసం 1523 కోట్ల రూపాయలతో 32 కాలనీలు నిర్మిస్తున్నామన్నారు.
గ్రామ, వార్డ్ సచివాలయాల వ్యవస్థ దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. గ్రామ,వార్డ్ సచివాలయాలు ద్వారా ఆదాయ,నివాస ధ్రువీకరణ పత్రాలతోపాటు అడంగల్, 1బి వంటి 545 సేవలను అందిస్తున్నామని, ఇప్పటివరకు 21 లక్షల 9 వేల సేవలందించామన్నారు.
వై.ఎస్.ఆర్. పెన్షన్ కానుక కింద జిల్లాలో 2 లక్షల 73 వేల 867 మందికి పెన్షన్ ను 2500 నుండి 2750 రూపాయలకు పెంపుదల చేసి జనవరి 1వ తేదీ నుండి అందిస్తున్నామన్నారు. మహిళా సాధికారతలో భాగంగా 27 వేల 312 డ్వాక్రా సంఘాలకు 1084 కోట్ల రూపాయలు రుణాలుగా అందిస్తున్నామని, జగనన్న ఇళ్ల లబ్దిదారులకు అదనంగా 109 కోట్ల రూపాయలు రుణంగా అందించామన్నారు. వై.ఎస్.ఆర్. ఆసరా పధకం కింద 330 కోట్ల రూపాయలు, వై.ఎస్.ఆర్. చేయూత పధకం కింద 223. 44 కోట్ల రూపాయలుఅందించామన్నారు. అమ్మఒడి పధకం లో ప్రస్తుత సంవత్సరం లక్షా 84 వేల 249 మంది తల్లుల ఖాతాలలో 276. 36 కోట్ల రూపాయలు జమచేశామని, జగనన్న విద్యా దీవెన పధకం కింద 106. 77 కోట్ల రూపాయలు, జగనన్న వసతి దీవెన పధకం కింద 35. 12 కోట్ల రూపాయలు విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమ చేశామన్నారు. జిల్లాలోని 1537 ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు కారక్రమం కింద 430. 38 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పధకం కింద జిల్లాలోని 5. 58 లక్షల కుటుంబాలకు చెందిన 9. 47 లక్షల మంది వేతనదారులకు 120 లక్షల పనిదినాలు కల్పించి, 246 కోట్ల రూపాయలను వేతనంగా చెల్లించామన్నారు.
ఆరోగ్యశ్రీ పధకం ద్వారా 28 వేల మంది పేదలకు 68 కోట్ల రూపాయలతో ఉచితంగా శస్త్ర చికిత్సలు చేశామని, , ఆరోగ్య ఆసరా పధకం కింద 22 వేల మంది లబ్దిదారులకు 12 కోట్ల రూపాయలు ఆర్ధిక సహాయం అందించామన్నారు. ఎన్సీడీ సర్వేలో ప్రతీ ఒక్కరికి గుర్తింపు నెంబర్ అందించి రాష్ట్రంలో ప్రధమ స్థానంలో నిలిచామన్నారు. ఆర్బీ ఎస్ కే కార్యక్రమంలో భాగంగా లక్షా 50 వేల మంది బాలలకు పుట్టుకతో వచ్చే లోపాలను సరిదిద్దే శస్త్ర చికిత్సలు, రక్తహీనత నివారణ సేవలందించామన్నారు.
జల్ జీవన్ మిషన్ పధకం కింద 600 కోట్ల రూపాయలతో ప్రతీ ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, వాటర్ గ్రిడ్ కార్యక్రమం ద్వారా 5 మండలాల్లోని 164 గ్రామాలకు 205 కోట్ల రూపాయలతో తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నామని కలెక్టర్ చెప్పారు.వ్యవసాయంతో పాటు పారిశ్రామికంగా కూడా అభివృద్ధి కి చర్యలు తీసుకుంటున్నామని, సింగిల్ విండో విధానం ద్వారా 188 పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయడం జరిగిందన్నారు. 580 ఎం ఎస్ ఎం ఈ లు 48. 65 కోట్ల రూపాయల పెట్టుబడితో స్థాపించబడి, 2568 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు.మహిళల రక్షణకు ఉద్దేశించిన దిశా చట్టాన్ని జిల్లాలో పటిష్టంగా అమలు చేస్తున్నామని, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుండి అందిన విజ్ఞప్తుల మేరకు 28. 89 కోట్ల రూపాయలతో 766 పనులను మంజూరు చేశామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారవేదిక స్పందన దరఖాస్తుల పరిష్కారంలో జిల్లా రాష్ట్రంలో ముందంజలో ఉందని, స్పందన దరఖాస్తుదారుల వద్దకు అధికారులు స్వయంగా వెళ్లి, పరిష్కార విధానానికి సంబందించిన ఫోటోను కూడా ఆన్లైన్ లో పొందుపరిచేలా చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి సి. పురుషోత్తమ కుమార్, ఏలూరు రేంజి ఐ.జి పాల రాజు, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, జాయింట్ కలెక్టర్ పి అరుణ్ బాబు, సబ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్ర , ఉప కలెక్టర్ అపూర్వ భరత్, జిల్లా రెవిన్యూ అధికారి ఏ .వి.. ఎన్ .ఎస్. మూర్తి, ఆర్డీఓ కె. పెంచెల్ కిషోర్, ఆర్ విజయ రాజు ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డిఏ, బి శ్యాం ప్రసాద్ ఎస్ఇ (పోలవరం రైట్ కెనాల్ ఇరిగేషన్ సర్కిల్) కె రాజు డిప్యూటీ ఇంజనీర్ (పోలవరం రైట్ కెనాల్ ఇరిగేషన్.సర్కిల్) పి రామకృష్ణ జిల్లా వ్యవసాయ అధికారి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు , ప్రభృతులు పాల్గొన్నారు.

About Author