NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాయలసీమ హక్కులపై 12 ఏళ్లుగా సాగుతున్న మోసం

1 min read

మూడు ప్రభుత్వాలపై బొజ్జా దశరథరామిరెడ్డి ఘాటు విమర్శలు

కర్నూలు, న్యూస్​ నేడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో రాయలసీమకు హామీ ఇచ్చిన హక్కులను గత 12 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న మూడు ప్రభుత్వాలు అమలు చేయకపోవడం కేవలం నిర్లక్ష్యం కాదు.. ఇది స్పష్టమైన ద్రోహం అని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.గురువారం నంద్యాల పట్టణంలోని సమితి కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సభ్యుల విస్తృత స్థాయి సమావేశం జరిగింది.ఈ సందర్భంగా బొజ్జా మాట్లాడుతూ.. విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేక ప్యాకేజీతో పాటు తెలుగుగంగ, గాలేరునగరి, హంద్రీనీవా, వెలుగొండ వంటి సాగునీటి ప్రాజెక్టులు, కడప ఉక్కు కర్మాగారం, గుంతకల్లు రైల్వే జోన్, అనంతపురంలో ఎయిమ్స్ వంటి హామీలు అన్నీ కేవలం ఎన్నికల నినాదాలుగానే మిగిలిపోయాయని, ఒక్క అడుగు కూడా ముందుకు వేయని పాలకుల వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు.“రాయలసీమకు హక్కులు కాగితాలపైనే… అమలులో మాత్రం సున్నా” అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పదేళ్లు హైదరాబాద్‌ను రాజధానిగా కొనసాగించాల్సి ఉన్నప్పటికీ, ఆగమేఘాల మీద రాజధాని మార్పిడి చేసి రాష్ట్రాన్ని అప్పుల కూపంలోకి నెట్టారని, దీనికి అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ సమానంగా బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు.“రాయలసీమకు న్యాయం చేయకుండా రాజధాని అభివృద్ధి పేరుతో నాటకాలు ఆపాలి” అని ఆయన హెచ్చరించారు.సమితి కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ..అమరావతి రాజధాని పేరుతో కొత్త హామీలు ఇస్తున్న ప్రభుత్వాలు ముందుగా రాజధాని ఆదాయంలో రాయలసీమ వాటా ఎంత?రాజధానిలో రాయలసీమ వాసులకు ఎన్ని ఉద్యోగాలు?రాజదానిలో రాయలసీమ నిరుద్యోగులకు ఉపాధి, వ్యాపారాల కోసం ఎంత భూమి కేటాయింపు?అనే అంశాలను స్పష్టంగా ప్రకటించి, పార్లమెంట్ ద్వారా చట్టబద్ధం చేయాలని డిమాండ్ చేశారు.రాజకీయ పార్టీలు ఈ ద్రోహంపై మౌనం పాటించడం, రాయలసీమ సమాజం నిశ్శబ్దంగా ఉండడమే దీనికి కారణమని పేర్కొంటూ, ఇకపై ప్రజలను చైతన్యపరిచే పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో చెరుకూరి వెంకటేశ్వర నాయుడు, బెక్కెం రామసుబ్బారెడ్డి, బాలీశ్వరరెడ్డి, సంజీవ, రామనాగిరెడ్డి, రెడ్డి జాఫర్, చంద్రశేఖర్, యుగంధర్, ఎంసీ కొండారెడ్డి, మనోజ్, దశరథరామ్, శివరాంరెడ్డి, మహేశ్వర్ రెడ్డి, ఎర్రం శంకర రెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *