ఆంధ్రుల కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులు పొట్టి శ్రీరాములు
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఆంధ్ర రాష్ట్ర సాధనకు కృషి చేసిన మహనీయులను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ పేర్కొన్నారు. బుధవారంఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలో ఆంధ్రప్రదేశ్ మద్రాస్ ప్రావిన్స్ లో భాగంగా ఉండేదని తెలుగు మాట్లాడే వారి కోసం అప్పట్లో స్వతంత్ర రాష్ట్రంగా అవతరించడానికి చాలా బలమైన ఉద్యమాలు జరిగాయన్నారు. ఇందులో పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని కోరుతూ 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి 15 డిసెంబర్ 1952 వ తేదీన తెలుగు రాష్ట్ర ఏర్పాటు కోసం తన ప్రాణాలు అర్పించి అమరులయ్యారన్నారు. అటువంటి ఉద్యమం తర్వాత 1953లో రాయలసీమ ఆంధ్ర ప్రాంతాలను కలిపి కొత్త ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నవంబర్ 1, 1956 లో తెలంగాణను చేర్చి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిందన్నారు. అలా భాష ప్రాతిపదికన ఏర్పడ్డ తొలి రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ అన్నారు.జూన్ 2, 2014 న ఆంధ్రప్రదేశ్ ను రెండు రాష్ట్రాలుగా విభజించినప్పటికీ నంబర్ ఒకటవ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జరుపుకునే సంస్కృతిని మనం కొనసాగిస్తున్నామన్నారు. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత హైదరాబాదును రాజధానిగా కోల్పోయామన్నారు. అప్పటినుండి ఆంధ్రప్రదేశ్ కీర్తిని పునరుద్ధరించడానికి మనము అనేక అడ్డంకులను ఎదుర్కొంటున్నామని, ఆంధ్ర ప్రదేశ్ విభజనకు ప్రాంతీయ అసమానతలే ప్రధాన కారణం అన్నది అనేకమంది అభిప్రాయమన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు, మన జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించడానికి అధికారులందరూ అంకితభావంతో పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ హాజీ అబ్దుల్ శుకూర్ , మునిసిపల్ వైస్ చైర్మన్ మొల్ల రబ్బానీ , మండల నాయకులు ఉండవల్లి ధర్మారెడ్డి , మొల్ల జాకీర్ హుస్సేన్ , తమ్మడపల్లి విక్టర్, పాలమర్రి. జీవన్ సుందర్ రాజు, తాటిపాటి. అయ్యన్న, సి.యస్. ఐ పాలెం భాస్కర్ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.