అప్పుడు రెండు సిలిండర్లు కొనే డబ్బుకు.. ఇప్పుడు ఒక్కటే !
1 min readపల్లెవెలుగువెబ్ : వంట గ్యాస్ సిలిండర్ ధర పెరగడంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. పేద, మధ్య తరగతి భారతీయ కుటుంబాల సంక్షేమం కోసం పరిపాలించే సత్తా కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. గృహ వినియోగ సిలిండర్ ధర రూ.50 పెరిగిన నేపథ్యంలో ఆయన ఆదివారం ఓ ట్వీట్ చేశారు. 14.2 కేజీల గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ ధర 2014 మే నెలలో రూ.410 ఉండేదన్నారు. దీని ధర ప్రస్తుతం రూ.999కి చేరిందన్నారు. అంటే సుమారు రూ.585.50 పెరిగిందన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఒక్కొక్క సిలిండర్‌పై రూ.827 రాయితీ ఇచ్చిందని, ప్రస్తుత మోదీ ప్రభుత్వం రాయితీ ఇవ్వడం లేదని చెప్పారు. అప్పటి ధర ప్రకారం రెండు సిలిండర్లను కొనగలిగే సొమ్ముకు ఇప్పుడు కేవలం ఒక సిలిండర్ మాత్రమే వస్తోందని చెప్పారు. కేవలం కాంగ్రెస్ మాత్రమే భారతీయ పేద, మధ్య తరగతి కుటుంబాల సంక్షేమం కోసం పరిపాలిస్తుందన్నారు. ఇదే తమ ఆర్థిక విధానానికి మూలమని వివరించారు.