PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నదుల అనుసంధానం చేపట్టాల్సిన అవసరం ఉంది….

1 min read

– వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధితోనే రాష్ట్ర, దేశ సమగ్రాభివృద్ది ముడిపడి ఉందని

– రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి స్పష్టం చేసారు.

పల్లెవెలుగు వెబ్ నంద్యాల:  పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులు మంజూరు చేసిన నేపథ్యంలో సోమవారం నంద్యాల రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయంలో దశరథరామిరెడ్డి పత్రికా ప్రకటనను విడుదల చేశారు.ఈ సందర్భంగా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ… వెనుకబడిన ప్రాంతాల సమగ్రాభివృద్దికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉంది,  వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం మరియు నీటి లభ్యతకు ఆయా రాష్ట్రాల నీటి వాటాలో అంతర్గత సర్దుబాట్లు, నదుల అనుసంధానం ద్వారా చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఈ దిశగా చేపట్టే కార్యక్రమాలలో  వెనుకబడిన ఇతర ప్రాంతాల ఉనికికి, అభివృద్ధికి  ఆటంకం కాకుండా చూడవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉందని ఆయన స్పష్టం చేసారు.కానీ తమ రాజకీయ లబ్ది ప్రాధాన్యతగా కేంద్ర ప్రభుత్వం కర్నాటకలోని అప్పర్ బద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా, తెలంగాణ లోని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు మంజూరు చేసే దిశలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమ అవసరాలను పరిగణనలోకి తీసుకోక పోవడం ఆయన  తీవ్రంగా ఆక్షేపించారు.గత పది సంవత్సరాలుగా అప్పర్ బద్ర ప్రాజెక్టు అనుమతులకు కర్నాటక ప్రభుత్వం, తెలంగాణ లోని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అనుమతులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రమైన కృషి చేసాయనీ, దీనికి మద్దతుగా ఆయా రాష్ట్రాల లోని అన్ని రాజకీయ పార్టీలు ఆ ప్రాజెక్టుల సాధనకు మద్దతుగా నిలిచాయని ఆయన తెలిపారు. కాని రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించిన నీటిని వినియోగించుకొనడానికి రాష్ట్ర విభజన కంటే ముందే డి పి ఆర్ అనుమతులు పొందిన గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం, అనేక దశాబ్దాలుగా ప్రతిపాదనలో ఉన్న తుంగభద్ర హై లెవెల్ సమాంతర కాలువల నిర్మాణం, సిద్దేశ్వరం అలుగు నిర్మాణం, వేదవతి ఎత్తిపోతల పథకాలు గురించి పాలకులు ఆలోచన చేయకపోవడం చాలా బాదాకరమని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ పార్టీలు రాయలసీమకు బాసటగా నిలబడక పోవడం పట్ల ఆయన  విచారం వ్యక్తం చేశారు. ప్రాంతాల వెనుకబాటు ప్రాధాన్యతగా కాకుండా రాజకీయ పార్టీల రాజకీయ లబ్ది లక్ష్యాలతో జరుగుతున్న నిర్ణయాల్లో రాయలసీమ అభివృద్ధికి కీలకమైన సాగునీటి మౌళిక వసతుల నిర్మాణాలకు అనుమతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయాత్నాలు కూడా చేయకపోవడాన్ని, ఆ విషయాలపై  రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని రాకపోవడాన్ని దశరథరామిరెడ్డి తీవ్రంగా ఖండించారు.పైన పేర్కొన్న రాయలసీమ ప్రాజెక్టుల అనుమతులను పరిగణలోనికి తీసుకొని కర్నాటక, తెలంగాణ ప్రాజెక్టుల అనుమతుల విషయంలో సమగ్ర విధానంతో ముందుకు పోవాలని   కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామనీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అన్ని రాజకీయ పార్టీలు ఆ దిశగా క్రియాశీలకంగా పని చేయాలని దశరథరామిరెడ్డి   విజ్ఞప్తి చేసారు.రాయలసీమ సమాజం కూడా మనకు జరుగుతున్న అన్యాయాలపై గళమెత్తాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

About Author