PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రవాణా వ్యవస్థ..మెరుగు పడాలి..

1 min read
మాట్లాడుతున్న రాష్ట్ర రవాణా శాఖ ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు

మాట్లాడుతున్న రాష్ట్ర రవాణా శాఖ ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు

అందుకు ‘ భూ సేకరణ’ త్వరగా పూర్తి చేయాలి
– రాష్ట్ర రవాణా శాఖ ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు
పల్లెవెలుగు వెబ్​, కడప : జిల్లాలో రహదారుల అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న భూ సేకరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా (ఆర్ అండ్ బి) శాఖ ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ఆర్ అండ్ బి, ఎన్ హెచ్ .. అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ వీసీ హాలులో.. జిల్లాలోని నేషనల్ హైవేస్, ఆర్ అండ్ బి రోడ్స్, రైల్వేస్ కోసం.. జరుగుతున్న భూసేకరణ పనులపై .. రాష్ట్ర రవాణా(ఆర్ అండ్ బి) శాఖ ప్రత్యేక కార్యదర్శి డా.అర్జా శ్రీకాంత్, జేసీలు ఎం.గౌతమి(రెవెన్యూ), సి.ఎం.సాయికాంత్ వర్మ (అభివృద్ధి)లతో కలిసి సంబందిత శాఖల అధికారులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ సి.హరికిరణ్ అధ్యక్షతన జరిగిన సమీక్షకు కడప, రాజంపేట సబ్ కలెక్టర్లు పృద్వితేజ్, కేతన్ గార్గ్, డిఆర్వో మాలోల, జమ్మలమడుగు ఆర్డీవో నాగన్న, ఆర్ & బి ఎస్ ఈ మహేశ్వర రెడ్డి, సంబందిత శాఖల ఈఈలు హాజరయ్యారు. కార్యక్రమంలో ముందుగా.. జేసీ (రెవెన్యూ) గౌతమి.. జిల్లాలో భూ సేకరణ ప్రక్రియకు సంబంధించిన వివరాలను పవర్ పాయింట్ ద్వారా క్షున్నంగా వివరించారు.
రవాణా వ్యవస్థ.. మరింత సులభం..
కడప జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి ఉన్నారని, ఆయన ఆదేశానుసారం.. రహదారులను విస్తృత పరిచి.. రవాణా వ్యవస్థను మరింత సులభతరం చేసేందుకు చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు. అందులో భాగంగా.. జిల్లా మీదుగా వెళ్తున్న జాతీయ రహదారులు, రైల్వే లైన్ల నిర్మాణం, వాటి అభివృద్ధికి అదనంగా చేపడుతున్న భూసేకరణ పనులను వేగవంతం చేయాలన్నారు. ఈ ప్రక్రియలో ఫారెస్ట్, పర్యావరణ, కోర్టు సంబందిత అంశాలు, అభ్యంతరాలు ఉంటే త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారులు, రైల్వే, ఇరిగేషన్, ట్రాన్స్కో, భూగర్భ జల శాఖల అధికారులు రెవెన్యూ అధికారులను సమన్వయం చేసుకుంటూ.. నిర్దేశించిన గడువు లోపు భూసేకరణ పనులను పెండింగ్ లేకుండా పూర్తి చేయాలన్నారు. అత్యవసరంగా రోడ్లకు చేయాల్సిన మరమ్మతులు, ప్యాచ్ వర్కులను వెంటనే పూర్తి చేయాలన్నారు.
భూసేకరణ పనులు వేగవంతంగా చేస్తున్నాం : జిల్లా కలెక్టర్
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ మాట్లాడుతూ.. జిల్లాలో నేషనల్ హైవే, రైల్వే మార్గాల అభివృద్ధి, నిర్మాణాలకు అవసరమైన భూసేకరణ పనులను వేగవంతం చేస్తున్నామన్నారు. అందుకు సంబంధించి ఆయా రెవెన్యూ డివిజన్ల సబ్ కలెక్టర్ లు, ఆర్డీవోలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారన్నారు. భూసేకరణ లక్ష్యం, ఇప్పటి వరకు సాధించిన ప్రగతి, ఇంకనూ సాధించాల్సిన లక్ష్యం, ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలు తదితర వివరాలను పీఎస్ కృష్ణబాబుకు తెలియజేశారు. ఈ సమావేశంలో ఆర్అండ్ బి, నేషనల్ హైవే, రైల్వే, ఫారెస్ట్, భూసేకరణ, రెవెన్యూ శాఖల ఎస్.ఈ.లు, ఈఈలు, డిఇ లు, డీడీలు, కలెక్టరేట్ లోని భూసేకరణ విభాగం సూపరింటెండెంట్లు, తదితర అధికారులు పాల్గొన్నారు.

About Author